Begin typing your search above and press return to search.

న‌టిపై FIR.. నిషేధించిన పేలుడు ప‌దార్థంతో!

సోష‌ల్ మీడియా క్రేజ్ కోసం ఎంత‌కైనా తెగించేందుకు సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్స‌ర్లు వెన‌కాడ‌టం లేదు.

By:  Sivaji Kontham   |   27 Oct 2025 10:04 AM IST
న‌టిపై FIR.. నిషేధించిన పేలుడు ప‌దార్థంతో!
X

సోష‌ల్ మీడియా క్రేజ్ కోసం ఎంత‌కైనా తెగించేందుకు సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్స‌ర్లు వెన‌కాడ‌టం లేదు. కొంద‌రు లోయలోకి దూకేస్తారు.. మ‌రికొంద‌రు సముద్రంలోకి గెంతేస్తారు... ప‌లువురు ర‌న్నింగ్ ట్రెయిన్ లోంచి వేలాడుతూ ఫోటోషూట్లు చేస్తున్నారు. లోయ అంచులో నిల‌బ‌డి... పులి క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి చూస్తూ... ఇలాంటి అరుదైన విన్యాసాలకు కొద‌వేమీ లేదు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.. లైక్‌లు, క్లిక్ ల‌కు ఆస్కారం క‌ల్పిస్తున్నాయి. సెల్ఫీలు దిగుతూ బీచ్ లో గ‌ల్లంత‌యిన వారికి కొద‌వేమీ లేదు.

అయితే ప్ర‌మాదాల‌ను ఆశ్ర‌యించే రుగ్మ‌త‌ ఇన్ ఫ్లూయెన్స‌ర్లకే కాదు.. ఇప్పుడు హీరోయిన్ల‌కు వ్యాపించింది. ప్ర‌మాద‌క‌ర‌మ‌ని భావించి ప్ర‌భుత్వం నిషేధం విధించిన పొటాష్ గ‌న్ ఉప‌యోగించిన ప్ర‌ముఖ క‌థానాయిక తాన్యా మిట్ట‌ల్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దీపావ‌ళిరోజున ఈ భామ పొటాష్ గ‌న్ ని య‌థేచ్ఛ‌గా పేలుస్తూ ఆట‌లాడుతున్న ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి.

ఈ భామ‌పై మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కేసు నమోదు అయింది. హానికరమైన, ప్రాణాంతకమైన నిషిద్ధ పేలుడు ప‌దార్థంతో ఇంత స్వేచ్ఛ‌గా తాన్య ఇలా చేయాల్సింది కాద‌నే వాద‌న వినిపించింది. పండ‌గ రోజు ట్రెడిష‌న‌ల్ శారీలో క‌నిపించిన తాన్య న‌వ్వులు చిందిస్తూ పొటాష్ గ‌న్ ఉప‌యోగించింది. ఈ వీడియో క్లిప్ కూడా వేగంగా షేర్ అయింది.

భ‌ద్ర‌తా నియ‌మాల కార‌ణంగా ప్ర‌జ‌లు ప్ర‌మాదంలో ప‌డ‌కుండా నిషేధించిన దానిని ఉప‌యోగిస్తుందా? అంటూ నెటిజ‌నులు తాన్య‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. తాజా స‌మాచారం మేర‌కు.. పోలీసులు ఇప్పుడు తాన్యాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై స‌ద‌రు న‌టి ఇంకా స్పందించాల్సి ఉంది. నిషేధిత ప్ర‌మాద‌క‌ర‌ పేలుడు పదార్థంతో సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించేందుకే ఇలా చేస్తోందా? అని చాలా మంది నిల‌దీసారు. తాన్య ఇటీవ‌ల‌ బిగ్ బాస్ పోటీదారుగా పాపుల‌ర‌య్యారు. త‌న‌ను సోష‌ల్ మీడియాలో వేలాది మంది అనుస‌రిస్తున్నారు.