Begin typing your search above and press return to search.

దిగ్గజ నటుడి మరణం వేళ చవకబారు ప్రచారమా?

దిగ్గజ నటుడు నానా పటేకర్ హఠాన్మరణం సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన వేళ నటి తనుశ్రీ దత్తా ఆయన మృతిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

By:  Srikanth Kontham   |   9 Oct 2026 1:28 PM IST
దిగ్గజ నటుడి మరణం వేళ చవకబారు ప్రచారమా?
X

దిగ్గజ నటుడు నానా పటేకర్ హఠాన్మరణం సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన వేళ నటి తనుశ్రీ దత్తా ఆయన మృతిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నానా పటేకర్ మరణవార్తపై స్పందిస్తూ ఆమె `ఈవిల్ డెడ్` (చెడు అంతమైంది) అనే అర్థం వచ్చేలా పదజాలాన్ని ఉపయోగించడం పట్ల ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తనుశ్రీ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ ఐసిడబ్ల్యూఏ ఓ ప్రకటనను విడుదల చేసింది.

గోవాలోని నివాసంలో నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశమంతా ఆయనకు నివాళులర్పిస్తున్న సమయంలో తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు సున్నితత్వ రహితంగా ఉన్నాయని ఐసిడబ్ల్యూఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా మండిపడ్డారు. చవకబారు ప్రచారం కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇలా మాట్లాడటం సిగ్గుచేటని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.

నానా పటేకర్ గొప్ప నటుడే కాదు. పద్మశ్రీ గ్రహీత అని `నామ్ ఫౌండేషన్` ద్వారా కష్టాల్లో ఉన్న రైతుల కుటుంబాలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి అని ఐసిడబ్ల్యూఏ గుర్తుచేసింది. కార్గిల్ యుద్ధ సమయంలోనూ ఆయన దేశానికి సేవలు అందించారని తెలిపింది. ఒక వ్యక్తి మరణం తర్వాత ఇలాంటి నీచమైన పదాలు ఉపయోగించడం ప్రాథమిక మానవత్వానికే మ‌చ్చ అన్నారు. `కనీసం మీ నాలుకను అదుపులో ఉంచుకోవాల్సింది. సినీ పరిశ్రమ చరిత్రలోనే ఒకరి మరణం తర్వాత ఇలాంటి సంస్కారహీనమైన వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు` అని తనుశ్రీకి హితవు పలికింది.

అలాగే దేశమంతా దిగ్గజ నటుడిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయిన రోజున, తనుశ్రీ తన లక్నో ఈవెంట్ గురించి వ్యక్తిగత ప్రణాళికల గురించి మాట్లాడుకోవడాన్ని సంకుచిత మనస్తత్వంగా ఐసిడబ్ల్యూఏ అభివర్ణించింది. `మీ ఈవెంట్ లక్నోలో ఉన్నా. లండన్‌లో ఉన్నా ఎవరికీ ఆసక్తి లేదు. దేశం దుఃఖంలో ఉన్న సమయంలో మీ సొంత ప్రచారాన్ని చూసుకోవడం మీ చిన్న మనస్తత్వాన్ని చూపుతోంది` అని సంస్థ నిలదీసింది.

కాగా తనుశ్రీ దత్తా ఇన్స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసి నానా పటేకర్ మరణవార్త విన్నానని, అయితే తాను లక్నోలో జరిగే ఓ పెద్ద ఈవెంట్‌కు వెళ్తున్నానని, కాబట్టి దానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పింది. సాయంత్రానికి మీడియా దృష్టి `ఈవిల్ డెడ్` వైపు మళ్లుతుందని భావిస్తున్నానని, తగిన విధంగా ఎలా స్పందించాలో ఆలోచించి తర్వాత మాట్లాడతానని, కుటుంబానికి సానుభూతి అని చెబుతూ వీడియోను మధ్యలోనే ముగించింది. ఈ వీడియో నెటిజన్లతో పాటు పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది.

నానా పటేకర్- తనుశ్రీ దత్తా మధ్య వివాదం 2018లో తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. 2008 నాటి `హార్న్ ఒకే ప్లీజ్` చిత్ర షూటింగ్ సెట్‌లో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఆరోపించింది. ఇది భారతదేశంలో #MeToo ఉద్యమానికి పెద్ద ఊపునిచ్చింది. అయితే ఈ ఆరోపణలను నానా పటేకర్ తీవ్రంగా ఖండించారు. తగిన ఆధారాలు లేవనే కారణంతో 2019లోనే పోలీసులు ఈ కేసును మూసేసారు. కాలపరిమితి దాటిపోయిందనే కారణంతో ముంబై కోర్టు కేసు విచారణను అధికారికంగా కొట్టేసింది.