తెరపై ముద్దులు.. తారలు అసౌకర్యంగానే!
తెరపై ఎంతో రొమాంటిక్‌గా కనిపించే సన్నివేశాల వెనుక ఉండే చేదు నిజాలను తనుశ్రీ బహిరంగంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
By: Srikanth Kontham | 26 Sept 2026 1:00 PM ISTవెండి తెరపై రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దుల దృశ్యాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించినా? ఆ దృశ్యాల చిత్రీకరణ వెనుక నటీనటులు పడే వేదన, ఎదుర్కొనే అసౌకర్యం వర్ణనాతీతమని మాజీ నటి, మోడల్ తనుశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోని పెదవి ముద్దుల విషయానికొస్తే నటీనటులు, ప్రత్యేకించి హీరోయిన్లు ఏమాత్రం ఆనందించరని.. పైగా ఆ సమయాల్లో తీవ్రమైన మానసిక అసౌకర్యానికి గురవుతారని అభిప్రాయపడ్డారు. తెరపై ఎంతో రొమాంటిక్‌గా కనిపించే సన్నివేశాల వెనుక ఉండే చేదు నిజాలను తనుశ్రీ బహిరంగంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
షూటింగ్ సెట్‌లో పదుల సంఖ్యలో లైట్‌మెన్లు, కెమెరామెన్లు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల మధ్య అంతరంగిక సన్నివేశాల్లో నటించడం సాధారణ విషయం కాదని తనుశ్రీ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు భావించినట్లుగా నటీనటులు అలాంటి సన్నివేశాలను వ్యక్తిగతంగా ఎంజాయ్ చేయడానికి అక్కడ ఎలాంటి అవకాశం ఉండదని, అది కేవలం వృత్తిపరమైన బాధ్యత మాత్రమేనని తెలిపారు. ప్రత్యేకించి మహిళా నటీమణులపై ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణ సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుందని, సమాజం ,పరిశ్రమ దృష్టిలో పడే ముద్రల వల్ల వారు అంతర్గతంగా తీవ్ర అసౌకర్యానికి లోనవుతారన్నారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన తనుశ్రీ ప్రస్తావించారు. నిజ జీవితంలో తోటి నటులతో అన్నదమ్ముల్లా లేదా ఆత్మీయ మిత్రుల్లా మెలిగే సంబంధాలు ఉన్నప్పటికీ కథా డిమాండ్ పేరిట వారిని ముద్దు పెట్టుకోవాల్సి రావడం అత్యంత క్లిష్టమైన విషయమన్నారు. సొంత సోదరుల వలే భావించే నటులతో స్క్రీన్ పై ముద్దు సన్నివేశాలు చేయడం వల్ల నటీనటుల మనస్సు తీవ్రంగా చలించిపోతుందని అది వారి మనోభావాలను ఎంతో గాయ పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బంధాలకు, వృత్తిపరమైన బాధ్యతలకు మధ్య నలిగిపోతూ అలాంటి దృశ్యాలను పూర్తి చేయాల్సి రావడం పెద్ద సవాలని పేర్కొన్నారు.
స్క్రీన్ పై రొమాన్స్ పండించడం అనేది నటన మాత్రమే అయినా? హద్దులు దాటే ప్రతి సన్నిహిత సన్నివేశం నటీనటుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తనుశ్రీ అభిప్రాయపడ్డారు. మనసుకు ఇష్టం లేకపోయినా? కథకు అవసరమనే కారణంతో లేదా ఒప్పందాల ఒత్తిడి వల్ల ఇలాంటివి చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇలాంటి అనుభవాలు చాలామంది హీరోయిన్ల మనస్సును తీవ్రంగా కలచివేస్తాయని, సెట్ నుంచి బయటకు వచ్చాక కూడా అసౌకర్య భావన వారిని వెంటాడుతూనే ఉంటుందని వివరించారు.
ఆధునిక చిత్ర పరిశ్రమలో గ్లామర్‌ను పెంచడానికి ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే విదేశీ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాల కోసం ఇంటిమసీ కోఆర్డినేటర్లను నియమించే పద్ధతి ఇటీవల ఇండియన్ పరిశ్రమల్లో కూడా ప్రారంభమైనా? నటీనటులు ఎదుర్కొనే వ్యక్తిగత , మానసిక సంకోచాలు పూర్తిగా తొలగిపోలేదని తనుశ్రీ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. స్క్రిప్ట్ డిమాండ్ పేరిట నటీనటుల వ్యక్తిగత సరిహద్దులను దాటించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నకు తావిస్తున్నాయి.
