టాలీవుడ్ పెద్ద దిక్కు ఆయనొక్కడే.. ఇంకొకరు రారు లేరు కూడా!-తమ్మారెడ్డి
టాలీవుడ్ `పెద్ద దిక్కు` అంశం మళ్లీ మరిగిస్తోంది! పెద్దరికంపై తాజాగా జరిగిన ఒక సినిమా ప్రమోషన్స్ లో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
By: Sivaji Kontham | 11 March 2026 11:20 PM ISTటాలీవుడ్ `పెద్ద దిక్కు` అంశం మళ్లీ మరిగిస్తోంది! పెద్దరికంపై తాజాగా జరిగిన ఒక సినిమా ప్రమోషన్స్ లో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. చిత్ర పరిశ్రమకు ప్రస్తుతం ఒక సరైన మార్గదర్శి లేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి తన పనుల ద్వారా, సమస్యలను పరిష్కరించే చొరవ ద్వారానే `పెద్ద దిక్కు` అవుతారని.. అలాంటి లక్షణాలున్న ఒక పెద్దాయన (దాసరి నారాయణరావు గారిని ఉద్దేశిస్తూ) వద్దకు గతంలో తామందరం ఏ ఇబ్బంది వచ్చినా వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఆయనే చివరి వ్యక్తని.. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పరిశ్రమలో `పెద్ద దిక్కు` అనేది ఎవరైనా ఇచ్చే పదవి కాదని.. అలాంటి హోదా ఏదీ ఉండదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తమ్మారెడ్డి వ్యాఖ్యలను విశ్లేషిస్తే.. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు ఉండాలే తప్ప, అదొక నామినేటెడ్ పదవి కాదనే వ్యంగ్యం తమ్మారెడ్డిలో కనిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ సమస్యలపై గళం విప్పే వారు లేదా అందరినీ ఏకతాటిపైకి తెచ్చే వారు కరువయ్యారని.. దీనివల్ల చిన్న నిర్మాతలు.. కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆయన తన మాటల ద్వారా పరోక్షంగా అసహనాన్ని వ్యక్తం చేశారని కూడా అర్థం చేసుకోవచ్చు.
పలు సందర్భాల్లో తమ్మారెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో పరిష్కారం అయ్యేదని, కానీ ఇప్పుడు అంతా ముఠా రాజకీయాలుగా మారిపోయాయని కూడా గతంలో విమర్శించారు. పెద్ద దిక్కుగా చెప్పుకునే వ్యక్తులు అందరి శ్రేయస్సు కోరాలని, కేవలం తమ స్వలాభం కోసం చూసుకుంటే ఆ స్థానానికి విలువ ఉండదని ఆయన గతంలోనూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పరిశ్రమలో విభేదాలను పక్కన పెట్టి.. వ్యవస్థను బతికించుకోవడానికి ఒక శక్తివంతమైన నాయకత్వం అవసరమని ఆయన పదే పదే నొక్కి చెబుతున్నారు.
తెలుగు చిత్రసీమలో చాలా సమస్యలు ఉన్నాయి. థియేటర్ల సర్ధుబాటు సమస్య, కార్మికుల పారితోషికాల పెంపు సమస్యలు.. ఎగ్జిబిషన్ రంగంలో పేరుకుపోయిన సమస్యలు, సింగిల్ విండో అనుమతుల సమస్య.. టికెట్ ధరల పెంపు సమస్యలు.. ఒకటేమిటి ప్రతిదీ సమస్యగానే మారుతున్నాయి. అయితే వీటన్నిటినీ ఫోన్ కాల్ వేగంతో పరిష్కరించే పెద్ద దిక్కు కావాలనే పరిశ్రమ వ్యక్తులు ఉన్నారు. అయితే పరిశ్రమ మూల స్థంభాలుగా ఉన్న ఆ నలుగురు స్టార్ హీరోలు కానీ, నిర్మాతల గిల్డ్ పెద్దలు కానీ ఇండస్ట్రీ సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించలేని స్థితిలో ఉన్నారని కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలు సమస్యను లోతుగా పరిశీలించేలా చేస్తున్నాయి.
