Begin typing your search above and press return to search.

అని తర్వాత తమన్‌కి మరో పోటీ ఇతనేనా...?

టాలీవుడ్‌లో దేవి శ్రీ ప్రసాద్‌కి పోటీ అన్నట్లుగా ఎంట్రీ ఇచ్చిన తమన్ తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల సినిమాలకు వాయించేశాడు.

By:  Ramesh Palla   |   25 Oct 2025 11:45 AM IST
అని తర్వాత తమన్‌కి మరో పోటీ ఇతనేనా...?
X

టాలీవుడ్‌లో దేవి శ్రీ ప్రసాద్‌కి పోటీ అన్నట్లుగా ఎంట్రీ ఇచ్చిన తమన్ తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల సినిమాలకు వాయించేశాడు. మహేష్ బాబు మొదలుకుని అందరు సీనియర్‌ హీరోలు, యంగ్‌ హీరోల వరకు దాదాపు అందరు హీరోల సినిమాలకు తన సంగీతాన్ని అందించాడు. తమన్‌ సంగీతం టాలీవుడ్లో గత పదేళ్ల కాలంగా మారు మ్రోగుతూనే ఉంది. మరో వైపు దేవి శ్రీ ప్రసాద్‌ తన దర్శకులతో సినిమాలు చేసుకుంటూ సాగుతున్నాడు. ఆయన సినిమాలు తగ్గలేదు, అయితే తమన్‌ సినిమాలు మాత్రం తగ్గే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనిరుధ్‌ రవిచంద్రన్‌ ను టాలీవుడ్‌కి తీసుకు వచ్చి తమ సినిమాలకు సంగీతాన్ని ఇప్పిస్తున్న దర్శకులు, స్టార్‌ హీరోలు ఎక్కువ అయ్యారు. చాలా మంది హీరోలు అనిరుధ్‌ మా సినిమాకు సంగీతం ఇవ్వాలని కోరుకుంటున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్‌ ఎక్స్‌ లో షేర్‌ చేసిన వీడియో

కోలీవుడ్‌లో కెరీర్‌ ఆరంభం నుంచి అనిరుధ్‌ ఓ రేంజ్‌లో దూసుకు పోయాడు. కానీ టాలీవుడ్‌లో మాత్రం మొదట్లో కాస్త తడబడ్డా ఇప్పుడు నిలబడ్డాడు. వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను తన సంగీతంతో దడదడలాడిస్తున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ దేవర సినిమా కోసం అని ఇచ్చిన సంగీతం పాజిటివ్‌ మార్కులు తెచ్చి పెట్టింది. దాంతో ఆయనకు మరిన్ని సినిమాలు వచ్చాయి. ఇదే సమయంలో చాలా కాలంగా తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్‌ కుమార్‌ సైతం టాలీవుడ్‌లో జెండా పాతాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు సినిమాలకు ఇప్పటికే సంగీతాన్ని అందించిన జీవి ప్రకాష్‌ ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే ఉద్దేశంతో చర్చలు జరుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓజీ సినిమాకు సంబంధించిన హీరో ఎలివేషన్ సీన్స్‌ను ఆయన ఎక్స్ ద్వారా షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఓజీ సినిమాకు తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌

తమన్‌ ఓజీ సినిమాకు ది బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. ఫ్యాన్స్‌ను కుర్చి అంచున కూర్చోబెట్టిన తమన్ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమా స్థాయిని రెట్టింపు చేసిందని రివ్యూలు వచ్చాయి. అలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ తొలగించి, పవన్‌ కళ్యాణ్‌ ఎలివేషన్‌ సీన్స్‌ కు తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ ఉన్న వీడియోలను షేర్‌ చేయడం ద్వారా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫ్యాన్‌ మేడ్‌ వీడియోను జీవీ ప్రకాష్ షేర్‌ చేయడం ద్వారా తమన్‌ను రెచ్చగొట్టినట్లుగా అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఓజీకి తమన్ కంటే నేను బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చి ఉంటే ఇంకాస్త బెటర్‌గా ఉండేది అని ఈ వీడియోను షేర్‌ చేయడం ద్వారా జీవీ ప్రకాష్ చెప్పకనే చెబుతున్నాడు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి జీవీ ప్రకాష్‌ షేర్‌ చేసిన ఓజీ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

దేవి శ్రీ ప్రసాద్‌, అనిరుధ్‌ రవిచంద్రన్‌...

ఇప్పటికే టాలీవుడ్‌లో దేవి శ్రీ ప్రసాద్‌, అనిరుధ్‌, భీమ్స్ తో పాటు మరికొందరు యంగ్‌ అండ్‌ సీనియర్‌ సంగీత దర్శకులు దూసుకు పోతున్న సమయంలో తమన్‌ బిజీగానే ఉన్నాడు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి జీవీ ప్రకాష్ కూడా పూర్తి స్థాయిలో టాలీవుడ్‌ సినిమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తమన్‌ ఆఫర్లు తగ్గుతాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం. అనిరుధ్ వచ్చిన తర్వాత తమన్‌ కు రావాల్సిన సినిమాలు తగ్గాయని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జీవీ ప్రకాష్ సైతం టాలీవుడ్‌లో మరింత బిజీ కావాలని కోరకుంటే మాత్రం ఖచ్చితంగా తమన్‌ ఆఫర్లు మరిన్ని తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తమన్‌ పూర్తి స్థాయి ప్రతిభను వినియోగించి ది బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ఇస్తున్నప్పటికీ మెల్ల మెల్లగా ఫిల్మ్‌ మేకర్స్ మార్పు కోరుతున్నారని, అందుకే తమన్‌ ఆఫర్లు తగ్గుతున్నాయని అంటున్నారు. కానీ తమన్‌ నుంచి రాబోతున్న అఖండ 2 ఇతర సినిమాలు విడుదలైన తర్వాత మళ్లీ తమన్‌ టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్ డైరెక్ట్‌గా నిలుస్తాడని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు.