డీసీఎం తరహాలో సీఎం బరిలోకి దిగుతారా?
కానీ విజయ్ పూర్తిగా సినిమాలకు విరామం ప్రకటించి ముఖ్యమంత్రిగా పరిపాలనను ప్రారంభించారు.
By: Srikanth Kontham | 12 July 2026 12:33 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దళపతి విజయ్ చివరి చిత్రం `జన నాయగన్` విడుదల వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది? కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే సినిమా ప్రచారాల్లో చురుకుగా పాల్గొన్న ఉదాహరణ కళ్లముందు ఉండటంతో విజయ్ `జన నాయగన్` ప్రచారం విషయంలోనూ అదే తరహా వ్యూహం ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాజకీయ ప్రస్థానానికి ముందు విజయ్ ప్రకటించినట్లుగానే `జన నాయగన్` కెరీర్‌లో చివరి చిత్రం.
సాధారణంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాణిజ్య చిత్ర ప్రచారానికి రావడం అనేది పరిపాలనా పరంగా కొన్ని నిబంధనలతో కూడుకున్న వ్యవహారం. అయితే విజయ్ రాజకీయ ప్రయాణాన్ని సినిమా అభిమానుల మద్దతుతోనే నిర్మించుకున్నారు కాబట్టి ఈ చిత్రం ఆయనకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. తన అభిమానులకు ఇచ్చే వీడ్కోలు బహుమతి అవుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలతో కొనసాగుతున్నారు కాబట్టి ప్రచారాల్లో పాల్గొనడం వారికి రాజకీయంగానూ కలిసొచ్చింది.
కానీ విజయ్ పూర్తిగా సినిమాలకు విరామం ప్రకటించి ముఖ్యమంత్రిగా పరిపాలనను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన ఇమేజ్‌ను రాజకీయ నాయకుడిగానే స్థిరప రుచుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో గ్లామరస్‌గా పాల్గొనడం కంటే సామాజిక బాధ్యత గల నాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. `జన నాయగన్` ట్రైలర్ .. టీజర్లలో కనిపించిన రాజకీయ ఛాయలు చూస్తుంటే? ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఆయన నేరుగా వేదికల మీదకు రాకపోయినా? పరోక్షంగా సినిమాను తన రాజకీయ భావజాలానికి అనుసంధానించే అవకాశం ఉంది.
చిత్ర యూనిట్ కూడా ఆయన్ని ఇప్పుడు స్టార్‌గా కాకుండా బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రమోట్ చేయడం ద్వారా సినిమాకు మరింత మైలేజ్ వస్తుందని భావిస్తోంది. ఒకవేళ విజయ్ ప్రచారంలో పాల్గొంటే అది కేవలం సినిమా కోసమే అవ్వదు. తన పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వేదికగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడు స్తారా? లేదా తనదైన స్వతంత్ర శైలిని అనుసరిస్తారా? అనేది విజయ్ తీసుకోవాల్సిన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ అభిమానుల అంచనాలను గౌరవిస్తూనే ప్రభుత్వ హోదాను గౌరవించేలా మధ్యేమార్గాన్ని ఎంచుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ మెజార్టీ వర్గం మాత్రం విజయ్ పవన్ తరహా నిర్ణయాలు తీసుకునే అవకాశః లేదంటున్నాయి. వ్యక్తిగతంగా పవన్-విజయ్ ల తీరును..మనస్తత్వం ఆధారంగా చేసుకుని విజయ్ `జన నాయగన్` రిలీజ్ విషయంలో గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగే ఆయన వ్యూహం ఉంటుందని అంటున్నారు. మరేం జరుగుతుందన్నది చూడాలి.
