జన నాయగన్ ఊపిరి పీల్చుకో?
`జన నాయగన్` సినిమా గత ఏడాదే రిలీజ్ అవ్వాలి. కానీ అందులోని కొన్ని రాజకీయ అంశాలు , డైలాగులు అప్పటి ప్రభుత్వాలకు కంటగింపుగా మారాయనే ప్రచారం జరిగింది.
By: Srikanth Kontham | 5 May 2026 12:12 PM ISTదళపతి విజయ్ తమిళనాడు సీఎం పీఠాన్ని దక్కించుకోవడంతో `జన నాయగన్` ఊపిరి పీల్చుకుంటుందా? అష్టదింగ్భందనానికి గురైనా జన నాయగన్ దిగ్భందనాన్ని తొలగించుకుని బయటకు రాబోతుందా? అంటే అవుననే అనాలి. గత కొంతకాలంగా `జన నాయగన్` విడుదల విషయంలో రకరకాల రాజకీయ, న్యాయ పరమైన, సాంకేతిక సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. తాజాగా స్వయంగా కథానాయకుడే రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
`జన నాయగన్` సినిమా గత ఏడాదే రిలీజ్ అవ్వాలి. కానీ అందులోని కొన్ని రాజకీయ అంశాలు , డైలాగులు అప్పటి ప్రభుత్వాలకు కంటగింపుగా మారాయనే ప్రచారం జరిగింది. సెన్సార్ బోర్డు దగ్గర నుండి థియేటర్ల కేటాయింపు వరకు సినిమా అడుగడుగునా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సినిమా పేరులోనే `ప్రజా నాయకుడు` అనే అర్థం ఉండటం అది విజయ్ రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉండటంతో అప్పట్లో ఈ చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని అభిమానులు ఆరోపించారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. సినిమా విడుదలకు కావాల్సిన అనుమతులు, పంపిణీ వ్యవస్థలో ఉండే ఇబ్బందులు అత్యంత వేగంగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సినిమా అంటే సహజంగానే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజాలు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారి సినిమాలు సంచలనాలు సృష్టించాయి. తాజాగా విజయ్ విషయంలోనూ అదే పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విజయ్ రాజకీయ విజయానికి గుర్తుగా లేదా ఆయన పాలనలో తీసుకునే కీలక నిర్ణయాలకు అనుగుణంగా ఓ ప్రత్యేకమైన రోజున జన నాయగన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ చిత్రం ద్వారా ఆయన చెప్పాలనుకున్న సామాజిక సందేశం ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్తుందని ఇది ఆయన రాజకీయ ప్రయాణానికి కూడా మరింత బలాన్ని ఇస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
కేవలం తమిళనాడులోనే కాకుండా విజయ్‌కున్న గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాకున్న అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా ప్రభుత్వ మద్దతు కూడా పరోక్షంగా ఉండే అవకాశం ఉండటంతో థియేటర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతాయి. `జన నాయగన్` విడుదలైతే ఇదొక సినిమా మాత్రమే అవ్వదు. ఒక నాయకుడి విజయోత్సవంగా మిగిలిపోతుందని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ సినిమా అక్కడా వేగంగానే క్లియరెన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది.
ఇక `జన నాయగన్` చిత్రానికి కాలం కలిసొచ్చిందనే చెప్పాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరైన సమయం వచ్చినప్పుడు విజయం దానంతట అదే వస్తుందనే దానికి ఈ సినిమానే ఉదాహరణ. విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రెట్టింపు అయింది. త్వరలోనే వెండితెరపై `జన నాయగన్` సందడి మొదలు కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
