8 వారాల ఓటీటీ రూల్.. చిన్న సినిమాకే పెద్ద దెబ్బా?
తమిళ సినిమా ఇండస్ట్రీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల రిలీజ్‌లు ఆపేస్తామని నిర్మాతల సంఘాలు ప్రకటించడంతో విషయం సీరియస్ అయ్యింది.
By: M Prashanth | 23 Aug 2026 7:00 AM ISTతమిళ సినిమా ఇండస్ట్రీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల రిలీజ్‌లు ఆపేస్తామని నిర్మాతల సంఘాలు ప్రకటించడంతో విషయం సీరియస్ అయ్యింది. షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిపేస్తామని చెప్పారు. బయటకు చూస్తే ఇది నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య మరో వివాదంలా కనిపించినా, అసలు గొడవ మాత్రం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రావాలన్న దగ్గరే ఉంది.
కొత్త సినిమా థియేటర్లలో వచ్చిన తర్వాత కనీసం ఎనిమిది వారాలు పూర్తయ్యే వరకు ఓటీటీలో పెట్టకూడదని థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారు. ఆ షరతుకు నిర్మాతలు రాతపూర్వకంగా ఒప్పుకుంటేనే సెప్టెంబర్ 1 తర్వాత సినిమాలను ప్రదర్శిస్తామని కూడా నిర్ణయించారు. ఇప్పటివరకు చాలా తమిళ సినిమాలు నాలుగు వారాల దగ్గరే ఓటీటీలోకి వస్తున్నాయి. అదే ఇప్పుడు రెట్టింపు కావాలన్నది వారి డిమాండ్.
పెద్ద స్టార్ సినిమాకు ఈ ఎనిమిది వారాల గ్యాప్ కొంతవరకు కుదరవచ్చు. మొదటి రెండు మూడు వారాల్లోనే భారీ వసూళ్లు వస్తాయి. మంచి టాక్ ఉంటే తర్వాత కూడా షోలు కొనసాగుతాయి. కానీ చిన్న సినిమాకు పరిస్థితి వేరు. మొదటి వీకెండ్‌లోనే టాక్ కుదరకపోతే రెండో వారం నుంచి స్క్రీన్లు తగ్గిపోతాయి. అలాంటి సినిమాకు థియేటర్ రన్ అయిపోయినా ఓటీటీ కోసం మరో నెలకు పైగా వెయిట్ చేయాల్సి వస్తే నిర్మాత లెక్కలు మరింత ఇబ్బందిగా మారొచ్చు.
ఇక్కడ ఓటీటీ డీల్ కూడా ఇప్పుడు సినిమా బిజినెస్‌లో చిన్న విషయం కాదు. కొన్ని సినిమాలు థియేటర్ నుంచి ఎంత వస్తుందన్నదానికంటే ముందే డిజిటల్ హక్కుల మీద ఒక లెక్క వేసుకుని తయారవుతున్నాయి. రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీకి వస్తుందని ముందే ఒప్పందం జరిగితే, ఇప్పుడు ఎనిమిది వారాల రూల్ పెట్టడం వల్ల ఆ డీల్స్ కూడా మారాల్సి రావచ్చు. ఇదే నిర్మాతల వైపు నుంచి వస్తున్న పెద్ద అభ్యంతరాల్లో ఒకటి.
మరోవైపు థియేటర్ వాళ్ల లెక్క కూడా వేరే ఉంది. సినిమా నాలుగు వారాల్లో ఇంటికే వస్తుందని ముందే తెలిసిపోతే కొంతమంది ప్రేక్షకులు థియేటర్‌కు రావడం మానేసి ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారని వాళ్లు అంటున్నారు. అందుకే కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే థియేటర్ రన్‌కు కొంత ఊపిరి వస్తుందన్నది వారి వాదన. కానీ ఒకే రూల్‌ను స్టార్ సినిమా నుంచి చిన్న సినిమా వరకు అందరికీ పెట్టడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 1పైనే ఉంది. అప్పటివరకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మధ్య ఏదైనా మధ్యస్థ లెక్క కుదిరితే రిలీజ్ క్యాలెండర్ యథావిధిగా సాగొచ్చు. లేదంటే ఇప్పటికే డేట్లు ఫిక్స్ చేసుకున్న సినిమాలకు కొత్త సమస్య మొదలవుతుంది. షూటింగ్ పూర్తిచేసిన సినిమాలు వెనక్కి జరగాలి, తర్వాతి రిలీజ్‌లు కూడా వరుసగా షిఫ్ట్ కావాల్సి రావచ్చు. ఓటీటీ గ్యాప్‌పై మొదలైన గొడవ చివరకు తమిళ సినిమా క్యాలెండర్‌ను కదిలించే స్థాయికి వెళ్లింది.
