ఒకే ఒక్క సీన్.. ఆ సిరీస్ క్రేజ్ నే పెంచేసింది
కొద్ది నిమిషాల సీన్‌తోనే ఫ్రీడమ్ vs రెస్పాన్సిబిలిటీ అనే పెద్ద డిస్కషన్ ను తెరపైకి తీసుకురావడంలో ఈ సీన్ సక్సెస్ అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 25 Feb 2026 11:23 AM ISTఓటీటీల్లో కంటెంట్ పెరిగిన కొద్దీ ఆడియన్స్ అటెన్షన్ సంపాదించడం కష్టమైపోతుంది. కానీ ఒక్కోసారి అందులోని ఒకే ఒక్క సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మొత్తం సిరీస్‌కే హైప్ తీసుకొస్తుంది. తాజాగా తమిళ వెబ్ సిరీస్ హాట్‌స్పాట్2 విషయంలో కూడా అదే జరిగింది. రీసెంట్ గా రిలీజైన ఈ సిరీస్‌లో తండ్రి- కూతురు మధ్య జరిగే ఒక ఎమోషనల్ సీన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీన్
పొట్టి బట్టలు ధరించి బయటకు వెళ్లే టీనేజ్ అమ్మాయిని తండ్రి ప్రశ్నించగా, ఆమె ఇది నా స్వేచ్ఛ, స్త్రీ స్వాతంత్య్రం” అంటూ కౌంటర్ ఇస్తుంది. ఆ టైమ్ లో మౌనంగా ఉన్న తండ్రి, కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ కు చిరిగిన బనియన్, పాతకాలం గోచి లాంటి షార్ట్ వేసుకుని ఆమె స్నేహితుల ముందుకు వస్తాడు. అవమానంగా ఫీలైన కూతురు ప్రశ్నించగా, “చెన్నై ఎండల్లో ఇది నాకు కంఫర్ట్. మగాళ్ల దుస్తులపై వ్యాఖ్యానించడానికి నువ్వెవరు?” అని ప్రశ్నిస్తాడు. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిరీస్‌పై చర్చ మొదలైంది.
మహిళల దుస్తులపై కామెంట్స్ చేసిన శివాజీ
కొద్ది నిమిషాల సీన్‌తోనే ఫ్రీడమ్ vs రెస్పాన్సిబిలిటీ అనే పెద్ద డిస్కషన్ ను తెరపైకి తీసుకురావడంలో ఈ సీన్ సక్సెస్ అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మహిళా స్వేచ్ఛ అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. రీసెంట్ గా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. మహిళల దుస్తుల విషయంలో చేసిన కామెంట్స్‌పై విభిన్న వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.
ఆ సంఘటన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దులు ఉండాలా? అనే డిబేట్ బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు హాట్‌స్పాట్2 లోని ఈ సీన్ అదే అంశాన్ని మరో కోణంలో చూపించడంతో నెటిజన్లు ఈ రెండు విషయాలను లింక్ చేస్తూ చర్చిస్తున్నారు. కొంతమంది ఈ సీన్ ను బాధ్యతతో కూడిన స్వేచ్ఛపై క్లియర్ మెసెజ్ అని అంటుంటే, మరికొందరు దీన్ని మహిళల ఎంపికలపై ప్రశ్నగా చూస్తున్నారు. అలా అని అయితే సిరీస్ మొత్తం ఇదే టోన్‌లో లేదు. సిరీస్ లో కొన్ని పచ్చి నిజాలను కూడా చూపించి, సిరీస్ ను మరింత బోల్డ్ గా మలిచారు.
హీరోలపై విపరీతంగా ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పి, వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడనేది ఒక ఎపిసోడ్ లో చూపించగా, మరో ఎపిసోడ్ లో టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీని చూపించి ప్రస్తుతం సమాజంలో చాలా మంది చూస్తున్న చేదు నిజాలను చూపిస్తూ, కామెడీగానే బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పారు. తమిళంలో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సిరీస్ ను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మహిళా స్వేచ్ఛ, కుటుంబ విలువలు లాంటి అంశాలపై కొనసాగుతున్న చర్చల మధ్య ఈ సిరీస్ తెలుగు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.
