Begin typing your search above and press return to search.

ప‌రిశ్ర‌మ‌ను వెంటాడుతున్న పార్ట్-2 ఫ్లాప్ సెంటిమెంట్!

భారీ అంచనాల మధ్య వ‌చ్చిన పార్ట్2 చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా ప‌డ‌టంతో పరిశ్రమలో సీక్వెల్స్ ఫ్లాప్ సెంటిమెంట్ ఓ పెద్ద గండంలా తయారైంది.

By:  Srikanth Kontham   |   14 Sept 2026 6:00 AM IST
ప‌రిశ్ర‌మ‌ను వెంటాడుతున్న పార్ట్-2 ఫ్లాప్ సెంటిమెంట్!
X

ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమను విచిత్రమైన భయం వెంటాడుతోంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన బ్లాక్‌బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ (పార్ట్-2) తెరకెక్కించడం అక్కడ ఓ ట్రెండ్‌గా మారినా? ఆ సీక్వెల్స్ సాధిస్తున్న ఫలితాలు మాత్రం మేకర్స్‌ను భయాందోళనకు గురిచేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వ‌చ్చిన పార్ట్2 చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా ప‌డ‌టంతో పరిశ్రమలో సీక్వెల్స్ ఫ్లాప్ సెంటిమెంట్ ఓ పెద్ద గండంలా తయారైంది.

గతంలో వచ్చిన చిత్రాల ఘనవిజయాన్ని ఆధారంగా చేసుకుని తీసిన అనేక పార్ట్-2 సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన `ఇండియన్ 2` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పి. వాసు-రాఘవ లారెన్స్ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `చంద్రముఖి 2`, విక్రమ్ `సామి 2`, విశాల్ `పందెంకోడి 2` వంటి చిత్రాల ఫ‌లితాలు తారుమార‌య్యాయి. తాజాగా రిలీజ్ అయిన స‌ర్దార్ 2 కూడా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. మొదటి భాగాలు సాధించిన విజయంలో సగం కూడా సాధించలేక డిజాస్టర్లుగా ముగిసాయి.

సీక్వెల్స్ వరుసగా పరాజయం పాలవ్వడానికి ప్రధాన కారణం మొదటి భాగం పెంచిన అంచనాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి భాగంలో ఉన్న కథా బలం, భావోద్వేగాలు , వినోదం సీక్వెల్స్‌లో లోపించడమే ప్లాప్‌లకు కారణం. కేవలం బ్రాండ్ నేమ్‌ను, క్రేజ్‌ను మాత్రమే నమ్ముకుని స్క్రిప్ట్‌పై సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ప్రేక్షకులు ఈ చిత్రాలను నిర్దాక్షిణ్యంగా తిర‌స్కారించ‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. దీంతో నిర్మాతలు వందల కోట్ల నష్ట‌పోయారు .

ఈ ప్రతికూల పరిస్థితులు పార్ట్-2 ఫ్లాప్ సెంటిమెంట్ నడుమ తాజాగా కోలీవుడ్ అభిమానుల ఆశలన్నీ రాబోయే కొన్ని క్రేజీ సీక్వెల్స్‌పైనే నెలకొన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో తెర‌కెక్కుతోన్న‌ `జైలర్ 2`, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో కార్తి హీరోగా తెరకెక్కనున్న `ఖైదీ 2`, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా రానున్న కమల్ హాసన్ `విక్రమ్ 2` చిత్రాలపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రాలు ఆ ద‌ర్శ‌క‌, హీరోల ప్రతిష్టకే కాకుండా కోలీవుడ్‌లో సీక్వెల్స్‌పై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి కీలకంగా మారాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ వంటి ప్రతిభావంతులైన దర్శకులు తెరకెక్కించే `ఖైదీ 2`, `విక్రమ్ 2` చిత్రాలు కంటెంట్ పరంగా పక్కాగా ఉంటాయని.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని సినీ ప్రియులు బ‌లంగా నమ్ముతున్నారు.

ఏదేమైనా సీక్వెల్ తీయడం అనేది కత్తిమీద సాము లాంటిదని తమిళ పరిశ్రమ మరోసారి గ్రహించింది. ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌ను చెరిపివేసి రాబోయే చిత్రాలు కోలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చిపెడతాయా? లేదా? అన్న‌ది చూడాలి.