మరణాన్ని ముందే ఊహించి.. నేడు స్వర్గానికి..
అభినయ్ గత మూడు నెలల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో.. "డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం నేను మరో ఏడాదిన్నర మాత్రమే బ్రతుకుతాను" అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టారు.
By: Madhu Reddy | 10 Nov 2025 4:52 PM ISTతమిళ సినీ నటుడు అభినయ్ కింగర్ సోమవారం తెల్లవారుజామున తన నివాసంలో కన్నుమూశారు. చాలాకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న అభినయ్ కింగర్ గత కొద్ది రోజులుగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కూడా పని చేస్తూనే ఉన్నారు. అలాంటి ఈయన కాలేయ సమస్యతో ఈరోజు ఉదయం కన్నుమూశారు.. అయితే అభినయ్ తన మరణాన్ని ముందుగానే ఊహించారట. చనిపోయే మూడు నెలల ముందే తాను మరికొన్ని రోజుల్లో చనిపోతానని ఓ వీడియో రిలీజ్ చేశారు.
అభినయ్ గత మూడు నెలల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో.. "డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం నేను మరో ఏడాదిన్నర మాత్రమే బ్రతుకుతాను" అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన మూడు నెలలకే అభినయ్ మరణించడంతో ఆ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.దీంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు అభినయ్ చావుని ముందే పసిగట్టాడు అంటూ బాధ పడుతున్నారు. అభినయ్ మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభినయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ధనుష్ తండ్రి కస్తూరి రాజా డైరెక్షన్లో వచ్చిన తుళ్లువధో ఇళమై అనే మూవీ ద్వారా..ఈ సినిమా హైస్కూల్లో ఆరుగురు విద్యార్థుల చుట్టూ తిరిగే ఓ మూవీ. ఇందులో ఆరుగురిలో ఒకరిగా అభినయ్ కనిపించారు. అలా ఈ మూవీ ద్వారా సినిమాలో ఫేమస్ అయ్యారు.
అంతేకాదు ఈ సినిమా ద్వారానే హీరో ధనుష్ , అభినయ్ ఇద్దరు ఒకేసారి పాపులర్ హీరోస్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అభినయ్ తమిళ సినిమాల్లోనే కాకుండా కొన్ని మలయాళ సినిమాల్లో కూడా నటించారు. అయితే 2014 వరకు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దాంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేయడం ప్రారంభించారు. హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు అలుముకోవడంతో ఆయన చనిపోయే వరకు కూడా పని చేస్తూనే ఉన్నారట.అలా ఈ ఏడాది డైరెక్టర్ అభిషేక్ లేస్లీ దర్శకత్వం వహించిన గేమ్ ఆఫ్ లోన్స్ అనే తమిళ మూవీ ద్వారా మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గత నెల అంటే అక్టోబర్లో ఈ సినిమా ప్రెస్ మీట్ కి కూడా అభినయ్ హాజరయ్యారు.
అలా చనిపోయే వరకు ఈయన సినిమాల్లోనే కొనసాగారు. ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో చికిత్స తీసుకోలేని సమయంలో హీరో ధనుష్, కేపీవై బాల ఇద్దరు కూడా తన వైద్య చికిత్సకి ఆర్థిక సహాయం అందించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో అభినయ్ గుర్తు చేసుకున్నారు. కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఫలితం లేకుండా పోయింది. లివర్ పూర్తిగా చెడిపోవడంతో అభినయ్ గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయారు. అలా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు నటుడు అభినయ్ తన నివాసంలో మరణించాడు.
