లంబాడీ లేడీగా మిల్కీబ్యూటీ!
ఆయనకు జోడీగా తమన్నా? లంబాడీ యువతి పాత్రలో కనిపించనుందిట. అడవిలో సాహసాలు చేసే యువతిగా అమ్మడు కనిపించనుందని వినిపిస్తోంది.
By: Srikanth Kontham | 25 Nov 2025 3:00 AM ISTమిల్కీబ్యూటీ తమన్నా ప్రయాణం బాలీవుడ్..టాలీవుడ్, కోలీవుడ్ లో దేదీప్య మానంగా సాగిపోతుంది. నటిగా, నర్తకిగా అన్ని రకాల అవకాశాలు అందుకుంటుంది. మూడు భాషల్లోనూ ఈ తరహా అవకాశాలతో సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉండటం అన్నది తమన్నాకే చెల్లింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా? అమ్మడు ఎక్కడా నిరుత్సాహ పడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో? దర్శక, నిర్మాతలు కూడా ఆమె విషయంలో అంతే పాజిటివ్ గా ఉండటం కలిసొచ్చింది. వివాదం లేని నటిగా పేరుండటంతో అవకాశాల పరంగా చాలా మంది
నిర్మాతలకు మంచి ఆప్షన్ గా మారింది.
రేంజర్ తో తమన్నా రొమాన్స్:
ప్రతి భావంతురాల్ని ప్రోత్సహించడంలో తప్పేముందని నవతరం దర్శకులు అమ్మడికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం తమిళ, హిందీ ప్రాజెక్ట్ లతో క్షణం తిరిక లేకుండా గడుపుతోంది. బాలీవుడ్ లో నాలుగు సినిమాలు..తమిళ్ లో ఓ చిత్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తోన్న `రేంజర్` చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. తాజాగా అది నిజమేనని మేకర్స్ ధృవీకరించారు. యాక్షన్ అడ్వెంచర్ గా జగన్ శక్తి తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ రేంజర్ పాత్రలో కనిపించనున్నాడు.
ఆ రెండు పాత్రల తర్వాత:
ఆయనకు జోడీగా తమన్నా? లంబాడీ యువతి పాత్రలో కనిపించనుందిట. అడవిలో సాహసాలు చేసే యువతిగా అమ్మడు కనిపించనుందని వినిపిస్తోంది. హీరో పాత్రకు ధీటుగా తమన్నా పాత్ర ఉంటుందని చిత్ర వర్గాల నుంచి లీకైంది. ఈ తరహా పాత్రను తమన్నా ఇంత వరకూ పోషించలేదు. ప్రియురాలిగా , కాలేజ్ స్టూడెంట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. `బాహుబలి` మొదటి భాగంలోనూ ఓ గూడేనాకి చెందిన యోధిరాలి పాత్రలో కనిపించింది. అవంతిక పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది. అటుపై `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో నృత్య కళాకారిణి పాత్ర పోషించింది.
వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్:
ఈ రెండు పాత్రలు తమన్నా కెరీర్ కి ఎంతో ప్రత్యేకమైనవి. పాత్రల ఫరిది చిన్నదే అయినా? గొప్ప పాత్రలుగా నిలిచాయి. మళ్లీ ఆ తరహా పాత్రలు పోషించలేదు. తాజాగా `రేంజర్` లో లంబాడీ యువతి పాత్ర ఆమెకు సరికొత్త గుర్తింపును తెచ్చి పెట్టే అవకాశం ఉంది. అయితే ఈసినిమా రిలీజ్ కు మాత్రం ఏడాది సమయం పడుతుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు, తమన్నా మరో నాలుగు హిందీ సినిమాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది.
