Begin typing your search above and press return to search.

సౌత్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే? త‌మ‌న్నా అనుభ‌వ పాఠాలు!

తమన్నా అభిప్రాయం ప్రకారం.. హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) నటీనటులకు తమ ప్రతిభను చాటుకోవడానికి మరింత స్వేచ్ఛను, వైవిధ్యమైన వేదికను కల్పిస్తుంది.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 5:00 PM IST
సౌత్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే? త‌మ‌న్నా అనుభ‌వ పాఠాలు!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అటు బాలీవుడ్- ఇటు సౌత్ చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసిన‌ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా.. రెండు పరిశ్రమల మధ్య ఉన్న ఫిలింమేకింగ్ శైలి, వర్క్ కల్చర్ వ్యత్యాసాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రత్యేక ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్నా మాట్లాడుతూ హిందీ- దక్షిణాది సినీ పరిశ్రమల మధ్య ఉన్న కొన్ని ప్రాథమిక వైరుధ్యాలను.. తన వ్యక్తిగత కెరీర్ అనుభవాలను షేర్ చేసారు. ముఖ్యంగా సౌత్ చిత్రసీమలో ఒక నటిగా సుదీర్ఘకాలం నిలదొక్కుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో త‌మ‌న్నా విశ్లేషించిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తమన్నా అభిప్రాయం ప్రకారం.. హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) నటీనటులకు తమ ప్రతిభను చాటుకోవడానికి మరింత స్వేచ్ఛను, వైవిధ్యమైన వేదికను కల్పిస్తుంది. అక్కడ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన పాటలు, డాన్సులకే పరిమితం కాకుండా విభిన్నమైన కథాంశాలు కలిగిన పాత్రలను ఎంచుకునే అవకాశం నటీనటులకు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలలో పెద్దగా రాణించలేకపోయినా సరే.. నటనకు ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలు లభిస్తే చాలు.. నటీనటులు తమ అద్భుతమైన నటనతో అక్కడ సులభంగానే మెప్పించవచ్చని తమన్నా అభిప్రాయపడ్డారు.

అయితే హిందీతో పోలిస్తే దక్షిణాది సినీ పరిశ్రమ తీరు చాలా భిన్నంగా ఉంటుందని తమన్నా స్పష్టం చేశారు. ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో ఎవ‌రైనా న‌టి లేదా న‌టుడు రాణించాలంటే వారిలో క‌చ్ఛితంగా `స్టార్ క్వాలిటీ` ఉండాల్సిందేన‌ని త‌మ‌న్నా అన్నారు. అటువంటి బలమైన స్టార్ ఇమేజ్ లేదా క్వాలిటీ ఉన్నప్పుడే ఇక్కడి భారీ కమర్షియల్ చిత్రాలను... అందరినీ ఆకట్టుకునే గ్లామరస్ పాత్రలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం సాధ్యమవుతుందని త‌మ‌న్నా వివరించారు.

క‌మ‌ర్షియాలిటీ ప‌రంగా చూస్తే నార్త్ తో పోలిస్తే సౌత్ కొంత క్లిష్ఠంగా- లిమిటేష‌న్స్ ఉన్న ఇండ‌స్ట్రీగా చూడాల‌ని త‌మ‌న్నా అన్నారు. సౌత్ మార్కెట్‌లో కేవలం మంచి క్వాలిటీ పాత్రలు వచ్చినా.. నటీనటుల్లో కమర్షియల్ స్టార్ క్వాలిటీ లేకపోతే తెలుగు, తమిళం సహా మొత్తం దక్షిణాదిన రాణించడం చాలా కష్టమనేది త‌మ‌న్నా బలమైన నమ్మకం. ఇండస్ట్రీలో 10- 15 సంవత్సరాల పాటు సుదీర్ఘ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించిన మహిళా తార‌లను పరిశీలిస్తే.. వారు అటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూనే... ఇటు కమర్షియల్ అంశాలైన పాటలు, డాన్సులు ఉన్న పాత్రలలోనూ అద్భుతమైన బ్యాలెన్స్ ని సాధించగలిగారని తమన్నా విశ్లేషించారు.

తమన్నా మాటలను బట్టి చూస్తే.. సౌత్ చిత్రసీమలో నటిగా నిలబడాలన్నా, ఎదగాలన్నా `స్టార్ క్వాలిటీ` అనేది తప్పనిసరి నిబంధన అని అర్థం చేసుకోవ‌చ్చు. అలా కాకపోయినా హిందీ పరిశ్రమలో రాణించాలంటే మాత్రం మంచి వైవిధ్యమైన పాత్రలు దొరికితే చాలు. రెండు దశాబ్దాలుగా ఇరు పరిశ్రమలను బ్యాలెన్స్ చేస్తూ స్టార్ స్టేటస్‌ను కాపాడుకుంటున్న తమన్నా ప్రాక్టికల్ విశ్లేషణ నుంచి ప్రస్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌ ఔత్సాహిక న‌టీన‌టులు ఎలా దూసుకెళ్లాలో ఒక లెస్స‌న్ గా చూడాలి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సిద్ధార్థ్ మల్హోత్రాతో `వీ-వన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` .. వి.శాంతారామ్ టైటిల్ తో రూపొందుతున్న బ‌యోపిక్ లోను త‌మ‌న్నా న‌టిస్తోంది. ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన `పురుషన్` అనే చిత్రంతో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రాగిణి ఎంఎంఎస్ 3లోను న‌టిస్తోంది. జ‌గ‌న్ శ‌క్తి తెర‌కెక్కిస్తున్న ఓ రెండు చిత్రాల‌తోను త‌మ‌న్నా బిజీగా ఉంది.