Begin typing your search above and press return to search.

ఎప్పుడూ అబ్బాయిల‌తోనే స్నేహం చేసే న‌టి

సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య స్నేహం కంటే పోటీనే ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు.

By:  Sivaji Kontham   |   9 April 2026 9:37 AM IST
ఎప్పుడూ అబ్బాయిల‌తోనే స్నేహం చేసే న‌టి
X

సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య స్నేహం కంటే పోటీనే ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు. కానీ నటి మృణాల్ ఠాకూర్ తన తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసిన‌ విషయాలు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. ముఖ్యంగా మృణాల్‌కు అమ్మాయిలతో స్నేహం చేయడంపై ఉన్న పాత ఆలోచనలను మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా ఎలా మార్చేశారో వివరిస్తూ మృణాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృత్తిపరమైన పోటీని పక్కన పెట్టి.. వారిద్దరి మధ్య చిగురించిన ఈ అనుబంధం నిజమైన `సిస్టర్‌హుడ్`కు నిదర్శనంగా నిలుస్తోంది.

మృణాల్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. తాను ఎప్పుడూ అబ్బాయిల మధ్యే పెరిగానని చెప్పుకొచ్చారు. గతంలో త‌న‌కు అమ్మాయిలతో స్నేహం చేయడం అస్సలు సాధ్యం కాదనిపించేదట. స్నేహితుల బృందంలో ఐదుగురు అబ్బాయిలు ఉంటేఏకైక అమ్మాయిగా తానే ఉండేవారు. అమ్మాయిల మధ్య ఉండే సంభాషణలు లేదా వారి స్నేహ బంధం తనకు సెట్ కాదని భావించేవార‌ట‌. అయితే కాలక్రమేణా మహిళా స్నేహాలలోని గొప్పతనాన్ని.. అందులో ఉండే భావోద్వేగాల‌ను, మ‌ద్ధ‌తును ఇప్పుడు మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు.

ఈ మార్పుకు ప్రధాన కారణం `మిల్కీ బ్యూటీ` తమన్నా భాటియా అని మృణాల్ ఎంతో గర్వంగా చెబుతున్నారు. తమన్నాను ఒక `అత్యంత స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి`గా అభివర్ణించారు. తమన్నా అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆమె తన హృదయాన్ని గెలుచుకుందని పేర్కొన్నారు. కేవలం స్నేహితురాలిగానే కాకుండా.. తనకు ఎంతో ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చే వ్యక్తిగా తమన్నా నిలుస్తోందని మృణాల్ కొనియాడారు. జీవితాన్ని ఎలా ఆస్వాధించాలి.. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలి అనే విషయాల్లో తమన్నా తనకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తుంటారని మృణాల్ వెల్లడించారు.

వీరిద్దరి స్నేహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వీరిద్దరూ మొదటిసారి హైదరాబాద్ వెళ్తున్న ఒక విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. ఆ చిన్న ప్రయాణంలోనే వారి మధ్య మాటలు కలిసి.. అది ఒక బలమైన బంధానికి పునాది వేసింది. ఆ తర్వాత వారు `లస్ట్ స్టోరీస్ 2` అనే ప్రాజెక్ట్‌లో న‌టించినా.. వేర్వేరు విభాగాల్లో నటించారు. కానీ నిజజీవితంలో మాత్రం ఒకరికొకరు సోదరీమణులుగా మారిపోయారు. తమన్నా దగ్గర తాను ఏ విషయంలోనైనా ఎంతో స్పష్టంగా.. ఎటువంటి ఫిల్టర్లు లేకుండా మనసు విప్పి మాట్లాడగలనని మృణాల్ సంతోషం వ్యక్తం చేశారు.

ఒక అమ్మాయికి మరో అమ్మాయి ప్రాణ స్నేహితురాలిగా ఉండటం ఎంత అందమైన అనుభూతినిస్తుందో మృణాల్ ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. తనకు ఏ సమస్య వచ్చినా తమన్నా దగ్గర దానికి క‌చ్చితమైన పరిష్కారం ఉంటుందని మృణాల్ నమ్ముతున్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం.. ఎదుగుదలలో తోడుగా ఉండటం.. సంతోషాలను షేర్ చేసుకోవ‌డం.. వీరి స్నేహంలో ముఖ్యంగా మారాయి. వెండితెరపై పోటీ పడే ఇద్దరు నటీమణులు ఇలా సోదరీమణుల్లా కలిసి మెలిసి ఉండటం నిజంగా అభినందించదగ్గ విష‌యం.