ముందుచూపు తప్పనిసరి అంటోన్న మిల్కీ బ్యూటీ
గ్లామర్ ప్రపంచంలో వెలుగులు ఎప్పటికీ నిలవవని, స్టార్‌డమ్ శాశ్వతం కాదని టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
By: Sravani Lakshmi Srungarapu | 25 Feb 2026 3:45 PM ISTగ్లామర్ ప్రపంచంలో వెలుగులు ఎప్పటికీ నిలవవని, స్టార్‌డమ్ శాశ్వతం కాదని టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అవకాశాలు వరుస పెడుతున్నప్పుడే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, లేకపోతే కెరీర్ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆమె స్పష్టం చేయడం సినీ ఇండస్ట్రీ రియాలిటీకి ఒక రియల్ చెక్‌లా మారింది.
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి
15 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన తమన్నా గత రెండు దశాబ్దాలుగా అగ్ర హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఈ ప్రయాణం కేవలం గ్లామర్, హిట్ సినిమాల వరకే పరిమితం కాలేదని ఆమె చెబుతున్నారు. చేతి నిండా సినిమాలు ఉన్నప్పుడే సంపాదనను సరైన దిశలో మళ్లించాలని, నటీనటుల కెరీర్ ఎప్పుడెప్పుడు మలుపు తిరుగుతుందో చెప్పలేమని, కాబట్టి ముందుగానే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోవాలంటూ ఆమె చెప్పిన మాటలు ఇండస్ట్రీలోని అస్థిరతను స్పష్టంగా చూపిస్తున్నాయి.
అవకాశాలు తగ్గాక ఆర్థిక సమస్యలు తప్పవు
సినిమా రంగం వెలుగుల ప్రపంచమే అయినా, అవకాశాలు తగ్గిన తర్వాత చాలామంది కళాకారులు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు కొత్తవి కావు. ఒకప్పుడు టాప్‌లో ఉన్నవారు కూడా తరువాతి కాలంలో ఇబ్బందులు పడిన సంఘటనలు చాలానే చూశాం. ఈ నేపథ్యంలో తమన్నా చేసిన వ్యాఖ్యలు యువ నటీనటులకు హెచ్చరికలా మారాయి. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఫ్యూచర్ కోసం బలమైన ఆర్థిక ప్రణాళిక అవసరమని ఆమె సూచిస్తున్నారు.
తండ్రి వల్లే ఈ క్రమశిక్షణ
అయితే తనకు ఈ దూరదృష్టి రావడం వెనుక తన తండ్రి పాత్ర ఎంతో కీలకమని తమన్నా స్పష్టం చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల నుంచే తన ఆర్థిక వ్యవహారాలన్నీ తన తండ్రే చూసుకున్నారని.. ఖర్చు, పొదుపు, పెట్టుబడుల విషయంలో ఆయన చూపిన క్రమశిక్షణే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని తమన్నా పేర్కొన్నారు. తన తండ్రి నేర్పిన పాఠాలే తనను రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చేశాయని, కుటుంబం నుంచి వచ్చిన మార్గనిర్దేశమే తనకు భరోసానిచ్చిందని తమన్నా వెల్లడించారు.
పలు వ్యాపారాల్లో తమన్నా పెట్టుబడులు
ప్రస్తుతం యాక్టింగ్ తో పాటు సొంతంగా జ్యుయలరీ బిజినెస్ ను రన్ చేస్తున్న తమన్నా, కెరీర్ ఎంత బిజీగా ఉన్నా ఆర్థిక ప్రణాళిక విషయంలో రాజీ పడనని చెబుతున్నారు. ఇండస్ట్రీలో మంచి ఫామ్ ఉన్నప్పుడే ఫ్యూచర్ కోసం పునాది వేసుకోవాలని తమన్నా ఇచ్చిన మెసేజ్ కేవలం నటీనటులకే కాదు, అన్ని రంగాల వారికి కూడా వర్తించేదే. స్టార్‌డమ్ కంటే స్థిరమైన భవిష్యత్తే ముఖ్యమని ఆమె వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేశాయి.
