Begin typing your search above and press return to search.

భ‌యం వేసినా ప‌డే స‌మ‌యం కూడా త‌మ‌న్నాకివ్వ‌లేదు

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్న క్యారెక్ట‌ర్ తో ప‌రిచ‌య‌మై తాను సైతం ఊహించ‌ని స్థాయికి అనూహ్యంగా చేరిపోయింది.

By:  Srikanth Kontham   |   3 Aug 2026 5:17 PM IST
భ‌యం వేసినా ప‌డే స‌మ‌యం కూడా త‌మ‌న్నాకివ్వ‌లేదు
X

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్న క్యారెక్ట‌ర్ తో ప‌రిచ‌య‌మై తాను సైతం ఊహించ‌ని స్థాయికి అనూహ్యంగా చేరిపోయింది. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ అంటూ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ అమ్మ‌డు స‌త్తా చాటింది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ప్ర‌స్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ కూడా దేదీప్యామ‌నంగా సాగిపోతుంది. ఇక మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకోవ‌డం ఒక్క‌టే మిగిలింది. ఆ కార్య‌క్ర‌మం కూడా ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని అంతా ఆశీస్తున్నారు. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే అమ్మ‌డు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విష యాలను పంచుకున్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, డ్యాన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడిందో త‌మ‌న్నా వివరించారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎలాంటి శిక్షణ లేకుండానే డ్యాన్స్‌ను ఒక సర్వైవల్ స్కిల్ గా మార్చుకున్నానని తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. భారీ సెట్లు .. వందలాది మంది టెక్నీషియన్ల మధ్య ఎలాంటి ముందస్తు రిహార్సల్స్ లేకుండానే పాటల్లో నటించాల్సి వచ్చేదని తమన్నా పేర్కొన్నారు.

అప్పట్లో భయపడటానికి సమయం లేదని, కేవలం నేర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేదని వెల్లడించారు. ఆ నాటి కఠినమైన షెడ్యూల్స్ .. నిరంతర ఒత్తిడే తనను అద్భుతమైన పెర్ఫార్మర్‌గా తీర్చిదిద్దాయని అభి ప్రాయపడ్డారు.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' లోని 'ఘఫూర్' పాట షూటింగ్ సమయంలోనూ ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. `రేంజర్` సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆరు గంటల నిద్రతోనే ఈ పాట కోసం ఎలాంటి రిహార్సల్స్ లేకుండా నేరుగా బరిలోకి దిగాల్సి వచ్చిందని త‌మ‌న్నా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్స్ మధ్య పని చేయడం నటీమణులకు పెద్ద సవాల్‌గా మారుతుందని పేర్కొన్నారు.

అలాగే హిందీ చిత్ర పరిశ్రమలో నటీమణుల డ్యాన్స్ ప్రాధాన్యత గురించి మాట్లాడారు. నటనకు, డ్యాన్స్‌కు మధ్య అనవసరమైన వ్యత్యాసం చూపించడం సరికాదని తమన్నా అభిప్రాయపడ్డారు. మాధురి దీక్షిత్, శ్రీదేవి, రేఖ వంటి లెజెండరీ నటీమణులు అప్పట్లో అద్భుతమైన నటనతో పాటు డాన్స్ నంబర్లతోనూ ప్రేక్షకులను అలరించారని గుర్తు చేశారు. నటన , నృత్యం వేర్వేరు కాదని అవి ఒకదానికొకటి అనుసంధానంగా ఉండాలని స్పష్టం చేశారు.

రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న తమన్నా కెరీర్ ప్రారంభంలో సంపాదించుకున్న వర్క్ ఎథిక్స్‌ వల్లే ఈ స్థాయికి చేరుకోగలి గాన‌న్నారు. భాషలతో సంబంధం లేకుండా ప్రతి చిత్రంలోనూ తన వంతు ఉత్తమ నటనను అందించేందుకు ఎప్పుడూ శ్రమిస్తానన్నారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒడిదుడుకులే తనలోని ప్రతిభను మరింత మెరుగుపరిచాయన్నారు. అందుకు దక్షిణాది చిత్ర పరిశ్రమ త‌న‌కు నటిగా బలమైన పునాదిని వేసింద‌న్నారు. అక్కడ నేర్చుకున్న పాఠాలే ఇండస్ట్రీలో నిలబెట్టాయని.. ఎలాంటి కష్టతరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఆ అనుభవాలే అందించాయ‌ని తెలిపారు.