Begin typing your search above and press return to search.

భక్తితో నిండిన క్షణాలు..తమన్నా ఇంటి ప్రత్యేక పూజ వైరల్!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తన పద్ధతితో అందరి మనసులు గెలుచుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   4 Jun 2026 9:02 PM IST
భక్తితో నిండిన క్షణాలు..తమన్నా ఇంటి ప్రత్యేక పూజ వైరల్!
X

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తన పద్ధతితో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఆధ్యాత్మికతకు, భక్తి మార్గానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ముంబైలోని తన ఇంట్లో అత్యంత భక్తిశ్రద్ధలతో ఒక ప్రత్యేక పూజను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను, ఆ సమయంలో తనకు కలిగిన ఒక మ్యాజికల్ ఫీలింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో చూసేద్దాం.




ముంబై వేడిని మాయం చేసిన వర్షం:

తమన్నా తన పోస్ట్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఎండలు దంచికొడుతున్నాయట. దాంతో ఇంట్లో పూజకు వచ్చే బంధువులు, స్నేహితులు అంత వేడిలో ఎలా కూర్చుంటారో అని తమన్నా ఫ్యామిలీ కాస్త కంగారు పడింది. కానీ విచిత్రంగా పూజ జరిగే రోజు తెల్లవారుజామున తమన్నా విండోలోంచి చూసేసరికి వాతావరణం మొత్తం మారిపోయింది. ఇక చల్లని గాలి, చెట్లు ఊగడం, ఒక్కసారిగా వర్షం పడటంతో ముంబైలోని వేడి అంతా మాయమైపోయింది. దీపారాధన చేయకముందే, వర్షం రూపంలో దేవి తమ ఇంటికి వచ్చేసిందని తమన్నా ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.




లింగ భైరవి దేవి పుణ్య పూజ:

ఇషా యోగా సెంటర్‌కు చెందిన వారి ఆధ్వర్యంలో తమన్నా ఇంట్లో 'లింగ భైరవి దేవి పుణ్య పూజ' చాలా ప్రశాంతంగా జరిగింది. పూజ పూర్తయి, మంత్రాలూ ఆగిపోయి, వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోయినా.. దేవి విగ్రహం పక్కనే కూర్చుని ఆ ప్రశాంతతను అనుభవించానని తమన్నా చెప్పారు.ఇక ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ఇంట్లోకి వస్తే కేవలం పూజ చేసిన వాళ్లకే కాదు, ఆ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆ పాజిటివ్ ఎనర్జీ తాకుతుందని ఆమె తన భక్తిని చాటుకున్నారు.




ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయిన మిల్కీ బ్యూటీ:

ఈ పూజ కోసం తమన్నా ముంబై వాతావరణానికి తగ్గట్టుగా ఎంతో పద్ధతిగా, సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయ్యారు. ఆమె మెజెంటా-పింక్ కలర్ చేనేత పట్టు శారీ కట్టుకున్నారు. బంగారు జరి బోర్డర్‌తో ఉన్న ఆ చీరలో తమన్నా మహాలక్ష్మిలా మెరిసిపోయారు. ఇక దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని.. చేతులకు ఎర్రటి గాజులు, చెవులకు ముత్యాల బుట్టలు పెట్టుకుని సింపుల్‌గా, ఎంతో అందంగా కనిపించారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ 'అచ్చమైన తెలుగు లక్ష్మిలా ఉన్నావు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కెరీర్‌తో పాటు ఆధ్యాత్మికత:

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రశాంతత కోసం ఆలయాలను సందర్శించడం, పూజలు, ధ్యానం చేయడం తన జీవితంలో ఒక భాగమని తమన్నా ఎప్పుడూ చెబుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ లగ్జరీ లైఫ్‌కే ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో.. తమన్నా ఇలా సింపుల్‌గా ఇంట్లోనే పూజలు చేస్తూ, భక్తి పారవశ్యంలో మునిగిపోవడం చూసి నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ హోదాలో ఉంటూ కూడా భక్తిని, సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న తమన్నా నిజంగా గ్రేట్. వర్షం రూపంలో దేవి తన ఇంట్లోకి అడుగుపెట్టిందంటూ ఆమె పెట్టిన పోస్ట్ చదువుతుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమన్నా.. ఈ దేవి ఆశీస్సులతో కెరీర్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనమూ కోరుకుందాం.