అదంతా అబద్ధం... తమన్నా భలే చెప్పిందే!
తమన్నా ఇటీవలే ది వ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Ramesh Palla | 24 Oct 2026 3:00 PM ISTమిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఆఫర్లు రాని సమయంలో కృంగిపోకుండా, వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో చిన్న సినిమాలను వదిలేయకుండా కెరీర్‌ను బ్యాలన్స్ చేస్తూ వచ్చింది కనుకే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా తమన్నా బిజీగా ఉందనే విషయాన్ని ఈ తరం నటీనటులు అర్థం చేసుకోవాలి. వరుస ఫ్లాప్స్ పడ్డప్పుడు కేవలం హీరోయిన్‌గానే సినిమాలు చేస్తానంటూ భీష్మించుకు కూర్చోలేదు, ఐటెం సాంగ్స్ నుంచి మొదలుకుని మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లను సైతం తమన్నా చేయడం వల్లే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా, తన కెరీర్‌ను తానే బిల్డ్ చేసుకున్న తమన్నాను చూసి చాలా మంది చాలా విషయాలు నేర్చుకోవాలని, ముఖ్యంగా ఈతరం హీరోయిన్స్ తమన్నాను ఆదర్శంగా తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ది వ్యాన్ సినిమాతో హిట్ సాధించిన...
తమన్నా ఇటీవలే ది వ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో డీసెంట్ వసూళ్లు రాబట్టి హిట్ జాబితాలో చేరిందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో తమన్నా నటించిన సినిమాలు మంచి స్పందన దక్కించుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది వచ్చే ఆమె సినిమాలకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏడాది పాజిటివ్ హోప్ తో ప్రారంభించే తమన్నా ఇటీవల ఒక చిట్ చాట్ లో చెప్పిన విషయంను జీవిత సత్యం అంటూ చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటివి కొద్ది మంది మాత్రమే, అది కూడా గొప్ప వ్యక్తిత్వం, లోతుగా ఆలోచించే వారు మాత్రమే చెప్పగలరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వరుస సినిమాలతో తమన్నా...
ఇంతకు తమన్నా ఏమన్నదంటే... మంచి అవకాశాల కోసం, సరైన అవకాశాల కోసం ఎదురు చూడటం వల్ల విజయం దక్కదు, కొత్త విషయాలను నేర్చుకోలేము. అత్యుత్తమ అవకాశం కోసం ఎదురు చూడటం అనేది పెద్ద అబద్ధం. అలా ఎదురు చూడటం వల్ల సమయం వృథా అవుతుంది తప్ప విజయాలు దక్కవు. నేను కెరీర్ ఆరంభంలో గొప్ప నటిని కాదు, గొప్ప డాన్సర్‌ను అసలే కాదు. పుట్టుకతో గొప్ప వ్యాపారవేత్తను కూడా కాదు. జీవితంలో మనం మన పని చేసుకుంటూ వెళ్తున్న సమయంలో తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి, తద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం, అంతే కాకుండా గొప్ప విజయాలు నమోదు అవుతాయని తమన్నా చెప్పుకొచ్చింది. మనం చేసే పనితో అనుభవం దక్కుతుంది, ఆ అనుభవం చాలా విషయాలను నేర్పిస్తుంది. అంతే తప్ప అవకాశాల కోసం ఎదురు చూడటం వల్ల ఏం నేర్చుకోలేమని తమన్నా పేర్కొంది.
సోషల్ మీడియాలో తమన్నా గురించి...
మంచి అవకాశం కోసం ఎదురు చూడటం అనేది చాలా పెద్ద తప్పు అని, అవకాశాల కోసం ఎదురు చూడకుండా, అందుబాటులో ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవాలంటూ తమన్నా భలే చెప్పిందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా చేస్తున్న తమన్నా జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నట్లు ఈ మాటలతో అర్థం చేసుకోవచ్చు. జీవితంలో పాఠాలు నేర్చుకున్న వారు కెరీర్ లో విజయం సాధిస్తారు, కెరీర్ లో విజయం సాధించిన వారు జీవితంలో గొప్ప పాఠాలు నేర్చుకున్నట్లు అని అంటారు. తమన్నా విషయంలో ఇది నూటికి నూరు శాతం నిజం అని ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది. తమన్నా ఇదే క్లారిటీతో ఉంటే కచ్చితంగా మరో పదేళ్లు ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఆమె తన పరిధిని, తన క్రేజ్‌ను, తన ప్రతిభను గుర్తు పెట్టుకుని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంది.
