Begin typing your search above and press return to search.

అవంతిక అత్యాచారం పై తమన్నా ఇలా..!

సినిమా కథలో భాగంగా తమన్నా డీ గ్లామర్‌ లుక్‌ను కాస్త ప్రభాస్‌ గ్లామరస్‌గా మార్చే సన్నివేశం ఒకటి ఉంటుంది.

By:  Ramesh Palla   |   4 Aug 2025 1:00 PM IST
అవంతిక అత్యాచారం పై తమన్నా ఇలా..!
X

తమన్నా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాయి. ఆమె ఇప్పటికీ బిజీగానే ఉంది. హీరోయిన్‌గా మునుపటి స్థాయిలో జోరు లేకున్నా ఐటెం సాంగ్స్‌తో, వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. చివరకు మ్యూజిక్‌ ఆల్బంలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తూ బిజీగా ఉంది. తమన్నా కెరీర్‌లో ఎన్నో పాత్రలు చేసింది. అందులోని కొన్ని పాత్రలు కొన్ని సార్లు వివాదాస్పదం అయ్యాయి. కొన్ని సినిమాలు సైతం వివాదాస్పదం అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా తమన్నా ఒక పాడ్‌ కాస్ట్‌లో తన కెరీర్‌లో ఎదుర్కొన్న వివాదాలపై స్పందించింది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో తాను చేసిన అవంతిక పాత్రకు సంబంధించిన వివాదం గురించి తమన్నా చాలా క్లియర్‌గా, ఓపెన్‌గా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

బాహుబలిలో అవంతిక పాత్ర

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందిన బాహుబలి సినిమాలో తమన్నా అవంతిక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌లో అనుష్కతో పోల్చితే తమన్నా పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ లభించింది. తమన్నా డీ గ్లామర్‌ లుక్‌లో, ఒక యోధురాలి లుక్‌లో కనిపించిన విషయం తెల్సిందే. సినిమా కథలో భాగంగా తమన్నా డీ గ్లామర్‌ లుక్‌ను కాస్త ప్రభాస్‌ గ్లామరస్‌గా మార్చే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆమె అనుమతి లేకుండానే బలవంతంగా డ్రస్‌ ను మార్చడం మొదలుకుని సహజ సిద్దమైన మేకప్‌ వరకు వేయడం ద్వారా చాలా అందంగా తయారు చేస్తాడు. ఆ సీన్‌ ఆలోచన చేసిన రాజమౌళిని చాలా మంది అప్పట్లో వావ్‌ అంటూ అభినందిస్తే, మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శించారు.

ది రే*ప్‌ ఆఫ్ అవంతిక కథనం

అమ్మాయి అనుమతి లేకుండా అలా ఎవరైనా చేస్తారా, అది ఖచ్చితంగా అవంతికను అత్యాచారం చేయడం అవుతుందని అన్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఏకంగా ది రేప్‌ ఆఫ్‌ అవంతిక అంటూ కథనంను ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది. అవంతిక ను శివుడు బలవంతంగా వివస్త్రను చేయడంతో పాటు, ఆమెను ఇష్టానుసారంగా తాకడం చేశాడని ఆ కథనంలో పేర్కొన్నారు. అవంతికను అతడు బలత్కారం చేసినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని, హీరోతో అత్యాచారం చేయించారని, ఆ అత్యాచారంకు సదరు అమ్మాయి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని రకరకాలుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయమై తమన్నా స్పందించింది. బాహుబలి సినిమాలో అవంతిక పై శివుడు అత్యాచారం అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది.

బాహుబలి వచ్చి 10 ఏళ్లు

ఆ విషయమై తమన్నా మాట్లాడుతూ... ఆ సీన్‌ లో జరిగింది ఎంత మాత్రం అత్యాచారం కాదు, ఒక స్త్రీ తన బాహ్య స్వరూపం తో పాటు, అంతః స్వరూపంను పురుషుని సహకారంతో చూసుకోవడం అనేది సీన్‌. చాలా అందంగా దర్శకుడు రాజమౌళి ఆ సీన్‌ను తెరకెక్కించారు. ఒక అమ్మాయి తనను తాను కనుకొనేలా చేసిన పురుషుడు అత్యాచారం చేసినట్లు ఎలా అవుతుందని తమన్నా ప్రశ్నించింది. ఆ సీన్‌ను ఫిల్మ్‌ మేకర్‌ చాలా అందంగా చూపించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం తప్ప దాంట్లో తప్పు ఏమీ లేదని, కొందరు కావాలని అలాంటి ప్రచారం చేశారు తప్ప దర్శకుడు రాజమౌళి ఆ సీన్‌ లో అవంతిక ను అవమానించినట్లు కాదన్నట్లుగా చెప్పుకొచ్చింది.

రాజమౌళి గారు ఆ సీన్ గురించి ముందుగానే చాలా చక్కగా వివరించారు. గాయపడ్డ ఒక అమ్మాయి అందంపై వ్యామోహం లేకుండా లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. ఆమెలోని అందం ను ఆమెకు చూపించడం ద్వారా ఆమెను ఆమెకు పరిచయం చేసే విధంగా శివుడు ఆమెతో అలా ప్రవర్తిస్తాడు అని చెప్పారు. ఆ సీన్‌ చెప్పిన సమయంలోనే నాకు బాగా నచ్చిందని తమన్నా పేర్కొంది. ఆ సినిమా వచ్చి దశాబ్దకాలం అవుతున్నా అవంతిక పై అత్యాచారం అంటూ ఇంకా కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి అయినా వారు వారి కథనాలను ఆపేస్తారేమో చూడాలి.