Begin typing your search above and press return to search.

పరాయి దేశాన్ని సైతం ఫిదా చేసిన చిత్ర‌మ‌ది!

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సృజనాత్మకత.. సాంకేతిక విలువలు ఇప్పుడు సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి

By:  Srikanth Kontham   |   25 Oct 2026 7:00 PM IST
పరాయి దేశాన్ని సైతం ఫిదా చేసిన చిత్ర‌మ‌ది!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సృజనాత్మకత.. సాంకేతిక విలువలు ఇప్పుడు సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్` పరాయి దేశ ప్రతినిధులను సైతం ఫిదా చేసింది. భారతదేశంలో పనిచేస్తున్న తైవాన్ దౌత్యవేత్త సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషంగా నిలిచింది.

న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించిన తైవాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత్‌లోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రతినిధి ముమిన్ చెన్ భారతీయ సినిమాలపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో తాను చూసిన భారతీయ చిత్రాల్లో రణ్‌వీర్ సింగ్ న‌టించిన‌ `ధురంధర్` ఆకట్టుకునే చిత్రంగా నిలిచిందని కొనియాడారు. రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు ప్రస్తుతం దౌత్యవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నందున తనకు పొలిటికల్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు.

`ధురంధర్` చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నటన, కథలో రాజకీయ నేపథ్యం , ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ముమిన్ చెన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని తీవ్రవాద ముఠాల నెట్‌వర్క్‌ను ఛేదించే భారతీయ గూఢచారి పాత్రలో రణ్‌వీర్ ఒదిగిపోయిన తీరు.. ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం విదేశీ ప్రతినిధుల మనసులను కూడా గెలుచుకోవడం భారతీయ సినిమా సత్తాను నిరూపిస్తోంది.

ఈ వేడుకలోనే ముమిన్ చెన్ బాలీవుడ్ అగ్ర నటులు, నిర్మాతల గురించి స్పందిస్తూ అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లపై ప్రశంసలు కురిపించారు. అమీర్ ఖాన్ అద్భుతమైన నటుడే కాక సమాజంలో ఉన్న సంక్లిష్టమైన సమస్యల ఆధారంగా సందేశాత్మక చిత్రాలను నిర్మిస్తారని కొనియాడారు. చిన్ననాటి నుంచి అమీర్ ఖాన్ సినిమాలు చూస్తూ పెరిగానని.. ఆయన నిర్మాణ శైలి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అలాగే షారూఖ్ ఖాన్ నటనకు తాను పెద్ద అభిమానినని వెల్లడించారు.

మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన `ధురంధర్` విదేశీ రాయబారుల ప్రశంసలు అందుకోవడం తో మ‌రింత‌ గ్లోబల్ రీచ్ సాధించిన‌ట్లు అయింది. వినోదంతో పాటు బలమైన రాజకీయ, సామాజిక కథాంశాలతో తెరకెక్కే భారతీయ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణకు ముమిన్ చెన్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలిచాయి.