అగ్రిమెంట్ లేకపోవడం వల్లే 'ఠాగూర్' మిస్..!
వరుస రీమేక్‌లు చేసి సక్సెస్ అయిన రాజశేఖర్ 'రమణ' రీమేక్ రైట్స్‌ను తీసుకున్నాడట. కానీ సాంకేతిక కారణాల వల్ల రీమేక్ చేజారిందని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.
By: Ramesh Palla | 25 April 2026 1:33 PM ISTమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకమైన మూవీగా 'ఠాగూర్' ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వి వి వినాయక్ దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు మ్యూజికల్‌గానూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 2002లో వచ్చిన తమిళ్ మూవీ 'రమణ' సినిమాకు రీమేక్గా ఠాగూర్ రూపొందింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందించడం జరిగింది. చిరంజీవి కంటే ముందు ఈ సినిమాను యాంగ్రీ యంగ్‌మన్ రాజశేఖర్ చేయాల్సి ఉందట. ఆ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. వరుస రీమేక్‌లు చేసి సక్సెస్ అయిన రాజశేఖర్ 'రమణ' రీమేక్ రైట్స్‌ను తీసుకున్నాడట. కానీ సాంకేతిక కారణాల వల్ల రీమేక్ చేజారిందని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.
రాజశేఖర్ మిస్ చేసుకున్న ఠాగూర్...
హీరోగా ఇన్నాళ్లు సినిమాలు చేస్తూ వచ్చిన రాజశేఖర్ మెల్ల మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ అవుతున్నాడు. కథలో ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు ఇబ్బంది లేదు అన్నట్లుగా రాజశేఖర్ చెప్పేశాడు. ఇటీవల శర్వానంద్ హీరోగా వచ్చిన బైకర్ సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలోని పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశాడు అంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం పూర్తి స్థాయిలో తన సహకారంను రాజశేఖర్ అందించడంతో సినిమాకు చాలా హెల్ప్ అయ్యాడు. యాక్షన్ సినిమాల్లో నటించే ఆసక్తిని కనబర్చే రాజశేఖర్ 'రమణ' సినిమా చూసి రీమేక్ చేయాలని అనుకున్నాడట. రాజశేఖర్‌కి ఆ సినిమా నిర్మాతకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో రీమేక్ రైట్స్ గురించి చర్చలు జరిగాయట. కానీ చివరకు రీమేక్ రైట్స్ చేయి జారింది.
నిర్మాత ఠాగూర్ మధు రైట్స్....
రమణ సినిమా రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు రాజశేఖర్ చర్చలు జరిపాడు. నిర్మాత స్నేహితుడే కావడంతో అగ్రిమెంట్ చేసుకోలేదట. కేవలం మాటలపై రీమేక్ రైట్స్‌ను తీసుకుని, అమౌంట్‌ను సైతం అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. ఆ సమయంలోనే రమణ నిర్మాతను తెలుగు నిర్మాత మధు కలిసి ఎక్కువ మొత్తం ఆఫర్ చేయడంతో రీమేక్ రైట్స్ ను రాజశేఖర్‌కి కాకుండా నిర్మాత మధుకు ఇచ్చేందుకు ఆయన ఒప్పుకున్నాడట. రాజశేఖర్ అప్పటికే అగ్రిమెంట్ చేసుకుని ఉంటే కచ్చితంగా ఆ సినిమా చిరంజీవి చేసే అవకాశం ఉండేది కాదు. రాజశేఖర్ హీరోగా ఠాగూర్ మూవీ వచ్చి ఉంటే కచ్చితంగా ఫలితం పాజిటివ్‌గానే ఉండేది. అయితే చిరంజీవి ఠాగూర్ సినిమాకు వచ్చిన స్థాయిలో వసూళ్లు వచ్చి ఉండకపోవచ్చు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి యాంగ్రీయంగ్ మెన్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ను చేజార్చుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ మూవీ...
తమిళ్‌లో విజయ్ కాంత్ హీరోగా నటించిన రమణ మూవీ కంటే కూడా ఠాగూర్ మూవీ ఎక్కువ వసూళ్లు సాధించింది. అంతే కాకుండా రికార్డ్‌ల పరంగా కూడా ఠాగూర్ ముందు నిలిచింది. సినిమాలోని నేను సైతం సినిమాకు జాతీయ అవార్డ్ రావడం విశేషం. ఠాగూర్ సినిమాకు అన్ని రకాలుగా కలిసి రావడంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రాజశేఖర్ ఠాగూర్ చేసి ఉంటే కచ్చితంగా ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన మూవీగా నిలిచి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆకట్టుకునే కథ, కథనంతో పాటు, పలు విషయాల్లో ఠాగూర్ కి మంచి పేరు వచ్చింది. చిరంజీవి కి సామాజికంగా కూడా ఠాగూర్ మంచి పేరును తెచ్చి పెట్టింది. రాజకీయాల్లో అడుగు పెట్టే ముందు చిరంజీవికి మంచి మైలేజ్‌ను ఇచ్చింది. ఠాగూర్ లోని నేను సైతం పాటను రాజకీయ ప్రచారం కోసం కూడా చిరంజీవి ఉపయోగించిన విషయం తెల్సిందే.
