రాఘవేంద్రరావు సలహాతో టబు ఇన్వెస్ట్ మెంట్!
సినిమా పరిశ్రమలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వచ్చే సంపాదనను సరైన మార్గంలో మళ్లించడం ముఖ్యం.
By: Srikanth Kontham | 12 Oct 2026 11:00 PM ISTసినిమా పరిశ్రమలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వచ్చే సంపాదనను సరైన మార్గంలో మళ్లించడం ముఖ్యం. ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు సంపాదనను రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లించడం, భూములపై భారీగా పెట్టుబడులు పెట్టడం బాగా వెలుగులోకి వచ్చిన అంశం. నాలుగైదు హిట్లు పడగానే వచ్చే రెమ్యూనరేషన్‌తో స్థిరాస్తులు కొనుగోలు చేసే ధోరణి నేటి తరం నటీనటుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అందరూ ఇప్పుడు పాటిస్తున్న ఈ బిజినెస్ ఫార్ములాను దశాబ్దాల క్రితమే అమలు చేసి ట్రెండ్ సెట్ చేశారు సీనియర్ నటి టబు.
టబు సుదీర్ఘ సినీ ప్రయాణంలో నటనతోనే కాకుండా ఆర్థిక క్రమశిక్షణలోనూ టబు ప్రత్యేకతను చాటుకున్నారు. టాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా, బాలీవుడ్‌లో పవర్‌ఫుల్ పెర్ఫార్మర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ కథానాయకి.. తన తొలి రోజుల నాటి జ్ఞాపకాలను, ఆర్థిక నిర్ణయాలను పంచుకున్నారు. టబు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి గల అసలు కారణాన్ని వెల్లడించి ఆశ్చర్య పరిచారు.
విక్టరీ వెంకటేష్ సరసన కథానాయికగా నటించిన `కూలీ నంబర్ 1` చిత్రం ద్వారా టబు తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఓ విలువైన సలహా ఇచ్చారట. ఆ సలహానే టబు ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వృథా చేయకుండా వెంటనే భూములపై పెట్టుబడి పెట్టాలని, అది భవిష్యత్తులో మంచి రాబడినిస్తుందని రాఘవేంద్రరావు సూచించారట.
దర్శకేంద్రుడి అనుభవాన్ని, విజన్‌ను గౌరవించిన టబు.. ఆయన ఇచ్చిన సలహాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమలులో పెట్టారు. `కూలీ నంబర్ 1` సినిమాకు వచ్చిన మొదటి పారితోషికంతోనే పరిసర ప్రాంతాల్లో స్థలాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు తన సంపాదనలో సింహభాగం రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడిగా పెడుతూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే? ఇండస్ట్రీలో చాలామందికి రియల్ ఎస్టేట్ ఆలోచన రాకముందే టబు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
అప్పట్లో రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ చిన్న సలహా ఫలితంగా టబు ఆనాడు చేసిన పెట్టుబడులు ఇప్పుడు కోట్లకు పడగెత్తాయి. కాలక్రమేణా ఆస్తుల విలువ విపరీతంగా పెరిగి బలమైన ఆర్థిక భరోసానిచ్చాయి. ఈ విషయాన్ని టబు స్వయంగా వెల్లడించిన నాటి పెట్టుబడులు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రాఘవేంద్రరావు చూపిన నాటి మార్గం తన జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోయిం దన్నారు.
నేటి తరం నటీనటులు కెరీర్ ఆరంభంలోనే పక్కా ప్లానింగ్‌తో ఉండాల్సిన అవసరాన్ని టబు జర్నీ గుర్తు చేస్తుంది. గ్లామర్ ప్రపంచంలో అవకాశాలు ఉన్నప్పుడే వచ్చే ఆదాయాన్ని సురక్షితమైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు నిశ్చింతగా ఉంటుందని నిరూపించారు. దశాబ్దాలు గడిచినా? తరగని ఆస్తిగా నిలిచిన ఆనాటి పెట్టుబడులతో టబు టాలీవుడ్ , బాలీవుడ్‌లో ప్లానింగ్ ఉన్న నటీమణులలో ఒకరిగా నిలిచారు.
