Begin typing your search above and press return to search.

బ్రాండ్ల ఒత్తిడితోనే సోషల్ మీడియాలోకి రీ-ఎంట్రీ!

డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత- వృత్తిపరమైన జీవితాలను శాసించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది.

By:  Srikanth Kontham   |   6 Jun 2026 6:00 AM IST
బ్రాండ్ల ఒత్తిడితోనే సోషల్ మీడియాలోకి రీ-ఎంట్రీ!
X

డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత- వృత్తిపరమైన జీవితాలను శాసించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ .. టాలీవుడ్ లలో వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోకి పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను వెల్లడించారు. కొంతకాలం పాటు డిజిటల్ ప్రపంచానికి, ముఖ్యంగా కొన్ని సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న అమ్మ‌డు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ కావడం వెనుక అభిమానులతో అనుసంధానం అవ్వాలనే కోరిక మాత్రమే కాదని ఇంకా చాలా కార‌ణాలే ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.

కార్పొరేట్ బ్రాండ్లు - వ్యాపార ప్రకటనల ఒప్పందాలు నటీనటుల ఎంపిక విషయంలో సరికొత్త నిబంధనలను విధిస్తున్నాయి. కేవలం వెండితెరపై నటన ప్రతిభను మాత్రమే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో నటుడికి లేదా నటికి ఎంతవరకు విజిబిలిటీ ఉంది అనే అంశాన్ని కూడా బ్రాండ్లు ప్రధానంగా గమనిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం యాక్టివ్‌గా ఉండే వారికే ఎండార్స్‌మెంట్లు ఇవ్వడానికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయనే నిజాన్ని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా అనేది ఒకప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి లేదా అభిమానులతో ముచ్చ టించడానికి మాత్రమే పరిమితం అయ్యేది.

కానీ ప్రస్తుత వాణిజ్య మార్కెట్‌లో వృత్తిపరమైన అవకాశాలను .. మార్కెట్ విలువను నిర్ణయించే బలమైన సాధనంగా మారింది. నిరంతరం పోస్టులు పెట్టడం .. రీల్స్ చేయడం తన వ్యక్తిత్వానికి కొంత భిన్నమైనదే అయినప్పటికీ వృత్తిపరమైన ప్రయోజనాలు .. బ్రాండ్ వాల్యూను కాపాడుకోవడం కోసం డిజిటల్ ప్రపంచంలోకి తిరిగి రాక తప్పలేదని తాప్సీ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం తాప్సీకి మాత్రమే పరిమితం కాలేదు. చిత్ర పరిశ్రమలోని మెజారిటీ నటీనటులు ఇలాంటి క‌నిపించ‌ని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

తమ నటనతో జాతీయ అవార్డులు .. విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటీనటులు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే పెద్ద బ్రాండ్ల రేసులో వెనుకబడిపోతున్నారనే చర్చ ఇండస్ట్రీలో చాలా కాలంగా సాగుతున్న‌దే. కార్పొరేట్ కంపెనీలు ప్రతిభ కంటే డిజిటల్ రీచ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం సెలబ్రిటీల జీవనశైలిని మార్చేస్తోందన్న‌ది కాద‌న‌లేని నిజం. సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్.. ప్రతికూలత .. మానసిక ఒత్తిడి కారణంగానే చాలా మంది నటీనటులు డిజిటల్ ప్రపంచానికి దూరం ఉండాలి భావిస్తుంటారు.

తాప్సీ కూడా గతంలో ఇలాంటి కారణాల వల్లే సోషల్ మీడియాలో క్రియాశీలతను తగ్గించుకున్నారు. అయితే వ్యాపార ప్రకటనల మార్కెట్ పరిణామాలు ,మేనేజ్‌మెంట్ టీమ్స్ నుండి వచ్చిన సలహాల మేరకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి వృత్తి కోసం మళ్లీ కెమెరా ముందుకు, నెటిజన్ల ముందుకు రావడం త‌ప్ప‌లేదు. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా? సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ అన్న‌ది నేటిత‌రం న‌టీమ‌ణుల‌కు కీల‌కంగా మారింది. సినిమాతో వ‌చ్చే క్రేజ్ కంటే సోష‌ల్ మీడియాతో వ‌చ్చే క్రేజ్ తోనే ఎక్కువ‌గా బ్రాండింగ్స్ చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం.