సౌత్‌లో ప్యాడెడ్ బ్రాలు.. నార్త్‌లో నేపోటిజం పిచ్చి.. తాప్సీ వ్యాఖ్యలు!
బాలీవుడ్‌లో అవుట్‌సైడర్ల పరిస్థితిపై తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు స్టార్‌డమ్ ఎంజాయ్ చేసే స్టేజ్ ఉండదు. మేము ప్రతి సినిమాలో మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సిందే.
By: Sivaji Kontham | 22 Feb 2026 11:47 AM ISTసౌత్ లో ఆశించిన స్టార్‌డమ్ అందుకోవడంలో తడబడిన తాప్సీ పన్ను, ఉత్తరాదిన మాత్రం తనదైన విలక్షణతతో హవా సాగిస్తోంది. ఇటీవల గ్లామర్ ఎలివేషన్ కంటే, తన మనసుకు నచ్చిన అవకాశాల్ని అందుకుంటోంది. తాప్సీ ఇటీవల ఎంతో కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతోంది. తన మాటల మాయాజాలంతో హృదయాల్లోకి దూసుకెళుతోంది.
నటి తాప్సీ పన్ను తన తాజా చిత్రం `అస్సీ` ప్రమోషన్లలో నేపోటిజం (వారసత్వం) గురించి, సినీపరిశ్రమలోని పలు కీలక విషయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అలియా భట్, సందీప్ రెడ్డి వంగా చిత్రాల గురించి తాప్సీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
తాప్సీ సంచలన వ్యాఖ్యలను పరిశీలిస్తే... నెపోటిజం గురించి అడిగిన ప్రశ్నకు తాప్సీ చాలా ప్రాక్టికల్‌గా సమాధానమిచ్చారు. నేపో కిడ్ అలియా భట్ గురించి మాట్లాడుతూ `గంగూబాయి కతియావాడి`లో అద్భుతంగా నటించింది. అందుకే అదే దర్శకుడితో తనకు మళ్ళీ అవకాశం వచ్చింది. దీన్ని ఎవరూ నెపోటిజం అనరు.. ఎందుకంటే అక్కడ టాలెంట్ ఉంది.. అని ప్రశంసించింది. అసలు సమస్య ఎప్పుడు వస్తుందంటే.. టాలెంట్ ఉన్నా లేకపోయినా కేవలం ఒకే వర్గం నుంచి వచ్చిన వారికే వరుసగా అవకాశాలు ఇస్తూ ఔట్‌సైడర్లను పట్టించుకోనప్పుడు మాత్రమే అది సమస్యగా మారుతుందని అన్నారు.
మీ పోరాటం ఆ నేపో పిల్లలకు ప్రయోజనం చేకూర్చలేదా? మీరు కంగనాతో స్నేహం చేస్తారా? అని ప్రశ్నించగా, నాకు వాళ్ళ గురించి తెలియదు.. కానీ ఎవరో ఒకరు ప్రయోజనం పొంది ఉంటారు. నేను కంగనను కలిసినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి గౌరవంగా పలకరిస్తానని తాప్సీ తెలిపారు.
బాలీవుడ్‌లో అవుట్‌సైడర్ల పరిస్థితిపై తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు స్టార్‌డమ్ ఎంజాయ్ చేసే స్టేజ్ ఉండదు. మేము ప్రతి సినిమాలో మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సిందే. ఒక్క ఫ్లాప్ వచ్చినా మమ్మల్ని పక్కన పెట్టేస్తారని తాప్సీ అన్నారు. పరిశ్రమలో ఇన్‌సైడర్లు ఒకరికొకరు బాగా అండగా నిలుస్తారు. కానీ ఔట్‌సైడర్ల మధ్య కూడా పోటీ ఉంటుంది.. మేము ఒకరినొకరం అంతగా సపోర్ట్ చేసుకోలేము! అని వ్యాఖ్యానించారు.
సందీప్ రెడ్డి వంగా చిత్రాలపై వస్తున్న విమర్శలపై తాప్సీ స్పందించారు. సినిమా వాళ్లు కూడా సాధారణ వ్యక్తులే.. వారి క్యారెక్టర్ లెవల్‌లో ఏమీ తేడా ఉండదు. సందీప్ రెడ్డి వంగా `యానిమల్` చిత్రంలో ఒక నెగటివ్ లేదా క్లిష్టమైన పాత్రను చూపించిన విధానాన్ని మెచ్చుకోవాలి. ఇదే రకమైన పాత్రను వేరే నిర్మాత హాస్యాస్పదంగా చూపించి ఉండవచ్చు. కానీ సందీప్ వంగా సినిమాలో దానిని చూపించిన విధానం ప్రశంసనీయం.. అని అన్నారు.
దక్షిణాదిలో తరచుగా ప్యాడెడ్ బ్రా ధరించమని చెబుతారు.. సమస్య ఏమిటంటే దర్శకుడు సెట్‌లో ఎవరికి చెప్పాలి. సెట్‌లో ఒక పాటను చిత్రీకరిస్తున్నప్పుడు.. అందరూ తేడాను చూస్తున్నప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించుకోండి! అని తాప్సీ అన్నారు.
తాప్సీ నటించిన అస్సీ థియేటర్లలో ఆడుతోంది. తదుపరి వో లడ్కీ హై కహాన్, గాంధారి, హసీన్ దిల్‌రుబా 3 వంటి చిత్రాలలో నటిస్తోంది.
