Begin typing your search above and press return to search.

క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి బ‌రిలోకి దిగిన‌ వీర‌నారి!

బాలీవుడ్ లో విలక్షణమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ.

By:  Srikanth Kontham   |   15 April 2026 8:45 AM IST
క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి బ‌రిలోకి దిగిన‌ వీర‌నారి!
X

బాలీవుడ్ లో విలక్షణమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ. తాజాగా అత్యంత సాహసోపేతమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న మిస్టరీ థ్రిల్లర్ కి `గాంధారి` అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం కథా పరంగానే కాక‌ తాప్సీ చేసే యాక్షన్ విన్యాసాలతో సరికొత్త చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని ఆసక్తిక‌ర అంశం ఏమిటంటే? తాప్సీ కళ్లకు గంతలు కట్టుకుని యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేయ‌డం.

పురాణాల్లోని గాంధారి పాత్ర లో తన కళ్లకు గంతలు కట్టుకుని జీవించినట్లే? ఆధునిక కాలపు గాంధారి కూడా క్లిష్ట పరిస్థితిలో చూపు లేకపోయినా శత్రువులను ఎలా ఎదుర్కొంది అనేది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందుకోసం తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ పొంది. తనలోని ఇంద్రియ జ్ఞానాన్ని ఉపయోగించి పోరాటాలు చేయడం విశేషం. సాధారణంగా ఇలాంటి యాక్షన్ సన్నివేశాల కోసం నటీనటులు డూప్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ తాప్సీ మాత్రం ఎలాంటి డూప్ లేకుండా తానే రిస్క్ తీసుకుని ఆ స‌న్నివేశాల్లో న‌టించింది. గంతలు కట్టుకుని ఫైట్ చేయడం, దూరం, దిశను అంచనా వేయడం కష్టమవుతుంది.

తద్వారా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినా పాత్రలో సహజత్వం కోసం తాప్సీ రాజీ ప‌డ‌లేదు. ఇది ఆమెలోని అంకితభావాన్ని నిరూపిస్తోంది. `హసీన్ దిల్‌రుబా`, `ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా` వంటి చిత్రాలతో హిట్ కొట్టిన రచయిత్రి కనికా థిల్లాన్ - తాప్సీల కాంబినేషన్‌లో వ‌స్తోన్న‌ మూడవ ప్రాజెక్ట్ ఇది. కనికా ఈ చిత్రానికి కథ అందించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో `గాంధారి`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ - మిస్టరీని మేళవించి ఒక హై-వోల్టేజ్ డ్రామాను అందించబోతున్నారు.

నెట్‌ఫ్లిక్స్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుద‌ల‌వ్వ‌డంతో చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కే అవకాశం ఉంది. కళ్లకు గంతలు కట్టుకుని పోరాడే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇది ప్రతీకార కథ మాత్రమే కాదు. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధప డుతుందనే ఎమోషనల్ జర్నీ. దీంతో తాప్సీ ఈ చిత్రం తో నటిగా తన పరిధిని మరింత విస్తరించుకోబోతుంది. ఫిజికల్ మేకోవర్ , యాక్షన్ స్కిల్స్ పరంగా తాప్సీ చేస్తోన్న‌ ప్రయోగం రాబోయే రోజుల్లో మహిళా ప్రధాన యాక్షన్ చిత్రాలకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం లేక‌పోలేదు. అలాగే తాప్సీ న‌టిస్తోన్న మ‌రో చిత్రం `వ‌హ్ ల‌డ్కీ హై క‌హానా` చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమా కూడా ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.