పర్ఫెక్షన్ ప్రెషర్‌పై తాప్సీ రియాక్షన్.. “లెట్ ఉమెన్ బీ మెస్సీ!”
సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు అనగానే అందంగా, పద్ధతిగా, ఎలాంటి తప్పులు చేయని పర్ఫెక్ట్ అమ్మాయిలుగా చూపించడం పాత పద్ధతి.
By: Madhu Reddy | 18 Aug 2026 4:00 PM ISTసినిమాల్లో హీరోయిన్ల పాత్రలు అనగానే అందంగా, పద్ధతిగా, ఎలాంటి తప్పులు చేయని పర్ఫెక్ట్ అమ్మాయిలుగా చూపించడం పాత పద్ధతి. అయితే దీనిపై నటి తాప్సీ పన్ను తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. 14వ జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాట్లాడిన ఆమె, సినిమాల్లో స్త్రీ పాత్రల రూపకల్పనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా కాకుండా, తప్పులు చేసే సాధారణ మనుషులుగా చూపించినప్పుడే ఆ క్యారెక్టర్లు రియలిస్టిక్‌గా ఉంటాయని టాప్సీ అభిప్రాయపడ్డారు.
ఆడవారిని పర్ఫెక్ట్‌గా చూపించాల్సిన అవసరం లేదు:
స్క్రీన్ పై స్త్రీలను ఎప్పుడూ ఒకేలా, ఆదర్శవంతంగా చూపించాల్సిన పనిలేదని తాప్సీ అన్నారు. మహిళలకు కూడా సొంత ఆశయాలు ఉంటాయి, వారు కూడా జీవితంలో పొరపాట్లు చేస్తారు. కాబట్టి వారి పాత్రల్లో అనేక రకాల షేడ్స్, సంక్లిష్టతలు ఉన్నప్పుడే కథలో ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. ఇక ఆడవారిని పర్ఫెక్ట్‌గా చూపించాలనే ప్రెషర్ నుంచి బయటకు వచ్చి, వారిని కూడా తప్పులు చేసే సాధారణ మనుషులుగా చూపించాలని స్పష్టం చేశారు.
రియలిస్టిక్ పాత్రలకే ప్రాధాన్యం:
సినిమాల్లో స్త్రీలకు పరిపూర్ణత కంటే సహజత్వమే ముఖ్యం అని టాప్సీ భావిస్తున్నారు. ఆడపిల్లలు తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో చేసే ప్రయత్నాలు, పడే తడబాట్లు తెరపై కనిపిస్తేనే ప్రేక్షకులు ఆ పాత్రలకు సులభంగా కనెక్ట్ అవుతారని చెప్పారు. ఇక కేవలం అందంగా కనిపించడానికో, లేదా పద్ధతిగా ఉండడానికో పరిమితం కాకుండా, విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న పాత్రలను డిజైన్ చేయాలని ఆమె కోరారు.
'పింక్', 'థప్పడ్' చిత్రాల ఉదాహరణలు:
తన కెరీర్ గురించి మాట్లాడుతూ 'పింక్', 'థప్పడ్' సినిమాలను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఈ రెండు చిత్రాలలోనూ తన పాత్రలు చాలా బలంగా, రకరకాల లేయర్లతో ఉంటాయని చెప్పారు. రొటీన్ మూస పద్ధతిలో కాకుండా, విభిన్నమైన శైలి ఉన్న కథలను ఎంచుకున్నప్పుడే నటీనటులుగా మన ప్రతిభ బయటపడుతుందని తెలిపారు. ఇక ప్రేక్షకులు ఏమనుకుంటారో అని భయపడకుండా యాక్టర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
రిస్క్ తీసుకుంటేనే కొత్తదనం:
తాప్సీ మొదటి నుంచి కూడా తనకు సరిపోయే, విభిన్నమైన రోల్స్‌ను ఎంచుకుంటూ టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణ మూస ధోరణిలో సాగే పాత్రలను పక్కనబెట్టి, సవాలుతో కూడుకున్న క్యారెక్టర్లను ఎంచుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సినిమా పరిశ్రమలో స్త్రీ పాత్రల ప్రాముఖ్యతను మరొకసారి చర్చనీయాంశంగా మార్చాయి.
ఇక సమాజంలో కానీ, సినిమాల్లో కానీ మహిళలపై ఉండే "పర్ఫెక్షన్" భారాన్ని తగ్గించాలన్న తాప్సీ అభిప్రాయం నిజంగా ఆలోచించదగినది. తెరపై ఆడవారిని సహజంగా, వారి లోపాలతో సహా చూపించినప్పుడే నిజమైన కథలు బయటకు వస్తాయి. టాప్సీలాంటి నటీమణులు ముందుకు వచ్చి ఇలాంటి విషయాలపై మాట్లాడటం నిజంగా అభినందనీయం.
