అలా చేయడానికి నా వద్ద అంత డబ్బు లేదు.. పీఆర్ స్టంట్స్ పై తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్
రీసెంట్ గా బాలీవుడ్ లో పెరుగుతున్న పబ్లిసిటీ కల్చర్ పై తాప్సీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
By: Sravani Lakshmi Srungarapu | 14 Jan 2026 12:00 AM ISTఒక బ్రాండ్, ఏదైనా మాల్, మరేదైనా బ్రాండ్, హీరో, హీరోయిన్ ఇలా ఎవరైనా సరే అందరికీ తెలియాలంటే వారికి పబ్లిసిటీ తప్పనిసరి. సౌత్ తో కంపేర్ చేస్తే నార్త్ లో సెలబ్రిటీలు ఎక్కువగా తమను తాము పాపులర్ చేసుకోవడానికి డబ్బులిచ్చి మరీ పీఆర్ టీమ్ ను రిక్రూట్ చేసుకుంటారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ లోని పీఆర్ వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కారు నటి తాప్సీ పన్ను.
రీసెంట్ గా బాలీవుడ్ లో పెరుగుతున్న పబ్లిసిటీ కల్చర్ పై తాప్సీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గత రెండేళ్లలో బాలీవుడ్ లో పీఆర్ స్టంట్స్ బాగా మారిపోయాయని, ఇప్పుడు ప్రమోషన్ అనేది కేవలం సినిమా గురించి మాట్లాడటానికే పరిమితం కాకుండా, వేరే వారిని తక్కువగా చూపించే స్థాయికి వెళ్లిందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతరులపై నెగిటివిటీ ప్లాన్స్
ప్రస్తుతమున్న సిట్యుయేషన్స్ లో కొన్ని పీఆర్ టీమ్స్ తమ సినిమాలకు హైప్ పెంచడానికి ఇతరుల సినిమాలపై నెగిటివిటీని ప్లాన్ చేస్తున్నాయని, ఇది హెల్తీ కాంపిటిషన్ కాదని, ఇంకా చెప్పాలంటే ఇది తప్పుడు దారి అని ఆమె వ్యాఖ్యానించారు. సినిమాలోని కంటెంట్, కథ, యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాల్సింది పోయి, పర్సనల్ ట్రోల్స్, వేరే వారిపై నిందలు వేయడం బాలీవుడ్ లో ట్రెండ్ గా మారిందని ఆమె అన్నారు.
బాలీవుడ్ లో చాలా మార్పులొచ్చాయి
తాను తన సొంత పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఏడాదిన్నర నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని, ఈ లోపు ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయని, పీఆర్ గేమ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లినట్టు తాను గ్రహించానని ఆమె చెప్పారు. బాలీవుడ్ లో ప్రతీ దానికీ డబ్బు చెల్లించాలని, టాలెంట్ ను కూడా డబ్బుతోనే ముడిపెడతారని, కానీ తాను అవన్నీ నమ్మనని, మన పనే మన గురించి చెప్పాలని భావిస్తానని చెప్పిన ఆమె, తాను ఇలాంటి వాటికి డబ్బును ఖర్చు పెట్టనని, తన కుటుంబం కోసం లేదా తన ప్రయాణాల కోసమే తాను డబ్బును ఖర్చు చేస్తానని, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమో లేదా పొగడ్తల కోసమో తాను రూ.50 వేలు ఇవ్వడానికి రెడీగా లేనని, తన వద్ద అంత డబ్బు కూడా లేదని ఆమె పేర్కొన్నారు.
