సినిమా హాల్లో కొత్త తలనొప్పి
మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు ఇంటర్వెల్ వచ్చిందంటే ఫుడ్ కౌంటర్ దగ్గర క్యూ కామన్.
By: M Prashanth | 28 Aug 2026 3:00 PM ISTమల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు ఇంటర్వెల్ వచ్చిందంటే ఫుడ్ కౌంటర్ దగ్గర క్యూ కామన్. పాప్‌కార్న్, కూల్ డ్రింక్ తీసుకునేలోపే సినిమా మళ్లీ మొదలైన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ సమస్యకు స్విగ్గీ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. హాల్లో నుంచే ఆర్డర్ చేస్తే ఫుడ్ నేరుగా సీటు దగ్గరకు వస్తుంది. వినడానికి బాగానే ఉంది. కానీ ఎక్కువ మంది ఇదే పద్ధతి వాడితే మరో ఇబ్బంది కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది.
స్విగ్గీ డైన్‌అవుట్‌లో వచ్చిన కొత్త సదుపాయం ద్వారా హాల్లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అక్కడి ఫుడ్ మెనూ కనిపిస్తుంది. కావాల్సినవి ఎంచుకుని డబ్బులు చెల్లిస్తే సీటు దగ్గరకు తీసుకొస్తారు. సినీపోలిస్, ఏషియన్ సినిమాస్‌తో ఈ సర్వీస్ మొదలవుతోంది. అంటే ఫుడ్ కోసం కౌంటర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.
నిజానికి సీటు దగ్గరకు ఫుడ్ తీసుకొచ్చే పద్ధతి పూర్తిగా కొత్తది కాదు. కొన్ని మల్టీప్లెక్స్‌లలో కౌంటర్ దగ్గర ఆర్డర్ ఇచ్చి సీటు నంబర్ చెబితే, ఫుడ్ రెడీ అయిన తర్వాత అక్కడికే తీసుకొస్తున్నారు. కానీ అప్పుడు ముందుగా కౌంటర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు సీటులో నుంచే ఆర్డర్ పెట్టే అవకాశం రావడంతో ఇలాంటి డెలివరీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అసలు ఇబ్బంది అక్కడే రావచ్చు. ఒకరి కోసం పాప్‌కార్న్, ఇంకొకరి కోసం డ్రింక్ అంటూ సిబ్బంది తరచుగా సీట్ల మధ్య తిరగాల్సి వస్తుంది. సీటు నంబర్ వెతకడం, మధ్యలో కూర్చున్న వాళ్లు పక్కకు జరగడం లాంటివి జరుగుతాయి. ఒకటి రెండు ఆర్డర్లు అయితే పెద్ద విషయం కాదు. హౌస్‌ఫుల్ షోలో చాలామంది ఇదే సదుపాయం వాడితే మాత్రం సినిమా మీద ఫోకస్ తప్పే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా కామెడీ, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఇది పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ హారర్ సినిమాలో కీలక సీన్ నడుస్తున్నప్పుడు ముందు నుంచి సిబ్బంది వెళ్లడం, సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్ మధ్యలో ఫుడ్ అందించడం మాత్రం కాస్త డిస్టర్బ్ చేయొచ్చు. సీరియస్ డ్రామాల్లో కూడా చిన్న కదలిక కనిపించినా దృష్టి అటువైపు వెళ్లిపోతుంది.
అందుకే ఈ కొత్త సదుపాయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది థియేటర్లు దాన్ని ఎలా నిర్వహిస్తాయన్నదిపైనా ఆధారపడి ఉంటుంది. ఇంటర్వెల్‌కు దగ్గరగా ఎక్కువ ఆర్డర్లు అందించడం, సినిమా కీలక భాగాల్లో కొంతసేపు డెలివరీ తగ్గించడం లాంటి పద్ధతులు పెడితే బెటర్. లేదంటే ఇప్పటివరకు కౌంటర్ దగ్గర కనిపించిన చిరాకు హాల్లో కనిపించవచ్చు.
