నిఖిల్ 'స్వయంభూ'.. సౌండ్ పెంచాల్సిందేనా?
అయితే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ, మరింత స్ట్రాంగ్ ప్రమోషనల్ కంటెంట్ అవసరమని ఫ్యాన్స్ ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.
By: M Prashanth | 17 March 2026 12:50 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వయంభూపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ భారీ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మూవీ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తోంది.
రిలీజ్ కు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది. ఇటీవల గుంటూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నిఖిల్ సందడి చేశారు. వేలాది మంది విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖిల్ స్టేజ్ పై విద్యార్థులతో కలిసి స్వయంభూ పాటకు డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ, మరింత స్ట్రాంగ్ ప్రమోషనల్ కంటెంట్ అవసరమని ఫ్యాన్స్ ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీజర్లు, ట్రైలర్లు, పాటలు వంటి అంశాల్లో మరింత హైప్ క్రియేట్ చేయాలని కోరుతున్నారు. సమ్మర్ సీజన్ లో అనేక భారీ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో స్వయంభూ ప్రత్యేకంగా నిలవాలంటే మేకర్స్ సౌండ్ పెంచాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న స్వయంభూ చిత్రానికి ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమా.. నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సినిమాలో నిఖిల్ ఓ పవర్ ఫుల్ యోధుడి పాత్రలో కనిపించనుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో ఆయన లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చారిత్రక నేపథ్యంతో కూడిన యుద్ధ సన్నివేశాలు, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.
కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నిఖిల్, స్వయంభూతో మరోసారి ఆ రేంజ్ ను దాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గత రెండేళ్లుగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమా.. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనులు కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ప్రస్తుతం ఆ వర్క్స్ చివరి దశలో ఉన్నాయని సమాచారం. మరి ఆడియన్స్ అంచనాలను మేకర్స్ ఎలా అందుకుంటారో.. ఎలాంటి సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తారో అన్నది అంతా వేచి చూడాలి.
