Begin typing your search above and press return to search.

నిఖిల్ స్వయంభు.. ఎంతవరకు వచ్చిందంటే..

పాత్ర కోసం నిఖిల్ 45 రోజులు వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, ఆయుధాల వినియోగం నేర్చుకున్నారు.

By:  M Prashanth   |   12 Sept 2026 10:53 PM IST
నిఖిల్ స్వయంభు.. ఎంతవరకు వచ్చిందంటే..
X

నిఖిల్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘స్వయంభు’ చివరి దశకు వచ్చింది. సినిమా షూటింగ్ మొత్తంగా 175 రోజులు పూర్తయిందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. అలాగే 2500కు పైగా సీజీ షాట్స్ ఉన్నాయని చెప్పింది. ఇంత పెద్ద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉన్నప్పటికీ, ఇప్పుడు షూటింగ్ పూర్తవడంతో రిలీజ్ డేట్‌పై మళ్లీ ఫోకస్ పడింది. ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

నిఖిల్ గత సినిమాలతో పోలిస్తే ‘స్వయంభు’ కోసం తీసుకున్న సమయం చాలా ఎక్కువ. ఇది రెగ్యులర్ యాక్షన్ సినిమా కాదు. చారిత్రక ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ యుద్ధ సన్నివేశాలు, పెద్ద సెట్స్, గుర్రాలు, సైన్యాలతో సినిమా రూపొందుతోంది. పాత్ర కోసం నిఖిల్ 45 రోజులు వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, ఆయుధాల వినియోగం నేర్చుకున్నారు. గుర్రపు స్వారీ, కత్తిసాముపై కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. టీజర్‌లో కనిపించిన సెంగోల్ కోసం జరిగే పోరాటం కూడా కథలో హైలెట్ కానుంది.

టీజర్‌లో క్రీస్తు శకం 985 కాలానికి చెందిన యోధుడిగా నిఖిల్ కనిపించారు. సినిమా కోసం తీసిన ఒక భారీ యుద్ధ సన్నివేశంలో 700 మంది సపోర్టింగ్ ఆర్టిస్టులు, 150 గుర్రాలు, 75 రథాలను ఉపయోగించారు. వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆ ఎపిసోడ్ షూట్ చేసినట్లు నిఖిల్ గతంలో చెప్పారు. లేటెస్ట్ ఫొటోలో భారీ బ్లూ స్క్రీన్ మధ్య యాక్షన్ షాట్ చేస్తూ కనిపిస్తున్నారు.

సినిమాకు మొదట ఫిబ్రవరి 13 రిలీజ్ డేట్ ప్రకటించారు. తర్వాత వీఎఫ్‌ఎక్స్ పనులకు మరింత సమయం అవసరమని చెప్పి ఏప్రిల్ 10కి మార్చారు. ఆ తేదీ కూడా దాటిపోయింది. అప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాలేదు. ఇప్పుడు మేకర్స్ స్వయంగా త్వరలో తేదీ ప్రకటిస్తామని చెప్పడంతో, ఈసారి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంయుక్త కూడా యోధురాలి లుక్‌లో కనిపించనున్నారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం చేస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఇది నిఖిల్ 20వ సినిమా కూడా. ‘కార్తికేయ 2’తో వచ్చిన పాన్ ఇండియా గుర్తింపుతో ఈ సినిమాను పలు భాషల్లో తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ ప్లాన్ మారిన ‘స్వయంభు’కు ఇప్పుడు సరైన తేదీ దొరకడం కూడా ముఖ్యం. పెద్ద సినిమాలు వరుసగా క్యాలెండర్‌లో ఉండటంతో మంచి వీకెండ్ కావాలి. మరోవైపు సీజీ పనులు పూర్తయ్యాక ప్రమోషన్స్‌కు సరిపడా సమయం అవసరం.