మదర్ థెరిస్సా టైప్ రోల్స్ చేస్తానని చెప్పిందా అంటూ ఇచ్చి పడేసిన నటి!
ఇటీవలే రిలీజ్ అయిన `టాక్సిక్` పై విమర్శల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 29 Aug 2026 7:43 PM ISTఇటీవలే రిలీజ్ అయిన `టాక్సిక్` పై విమర్శల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో బోల్డ్ సీన్స్ కాస్టింగ్.. క్యారెక్టరైజేషన్ చుట్టూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై నటి స్వాస్తిక ముఖర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ చిత్రంలో నటి కియారా అద్వానీ నియామకంపై.. ఆమె తల్లి కావడం వల్ల ఎలాంటి పాత్రలు చేయాలనే దానిపై జరుగుతున్న ట్రోలింగ్‌ను స్వాస్తిక ఖండించారు. మహిళ వ్యక్తిగత జీవితం లేదా మాతృత్వం ఆమె నటనకు లేదా ఎంచుకునే పాత్రలకు ప్రమాణంగా మారకూడదని స్వాస్తిక స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కియారా అద్వానీ తల్లి అయిన తర్వాత ఇలాంటి గ్లామరస్ ..బోల్డ్ పాత్రలు చేయడం తగదంటూ సలహాలు ఇచ్చారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన స్వాస్తిక ముఖర్జీ.. `తల్లి కావడం అనేది నటి కెరీర్‌ను .. ఆమె ఎంచుకునే పాత్రలను నిర్ణయించే అంశం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. సమాజంలో మహిళలపై ఉన్న మూస ధోరణులను, ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపుతూ నెటిజన్ల వైఖరిని తప్పుపట్టారు.
ఇదే సమయంలో స్వాస్తిక తనదైన శైలిలో వ్యంగ్యంగానూ స్పందించారు. `కియారా ఏమైనా తాను ఇకపై కేవలం మదర్ థెరిస్సా తరహా పాత్రలు మాత్రమే చేస్తాను? అని పాంప్లెట్లు పంపిణీ చేసిందా? అని నిలదీశారు. కళాకారులకు వారి వ్యక్తిగత జీవితానికి .. తెరపై పోషించే పాత్రలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందన్నారు. తల్లిగా మారినంత మాత్రాన పద్ధతిగల పాత్రలకే పరిమితం కావాలని కోరడం హాస్యాస్పదమని అన్నారు.
చలనచిత్ర పరిశ్రమలో పురుష నటులు తండ్రులైన తర్వాత కూడా ఎలాంటి హద్దులు లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తున్నప్పుడు మహిళా నటుల విషయంలో మాత్రమే ఎందుకీ విమర్శలు అని స్వాస్తిక ప్రశ్నించారు. ఈ రకమైన పక్షపాత ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ప్రతిభ ఉన్న నటీమణులు తమకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛను గౌరవించాలని కోరారు. `టాక్సిక్` చిత్రంలో కియారా అద్వానీ నటనపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
నటిగా కియారా అద్వానీకి లభించిన ఈ మద్దతుకు బాలీవుడ్ ..సౌత్ వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతిభావంతులైన నటీమణులు తమ వ్యక్తిగత మైలురాళ్లను అధిగమిస్తూ కెరీర్‌లో విభిన్నమైన సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడం పరిశ్రమ ఎదుగుదలకు నిదర్శనమని మెజార్టీ వర్గం అభిప్రాయపడుతోంది. మరి ఈ విమర్శళు..మద్దతులపై కియారా ఎలా స్పందిస్తుంది? అన్నది చూడాలి. ప్రస్తుతం కియారా పలు బాలీవుడ్ కమిట్ మెంట్లతో బబిజీగా ఉంది. అలాగే తెలుగులోనూ అమ్మడికి మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ కొత్త ఛాన్సుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.
