Begin typing your search above and press return to search.

ప‌ద్మావ‌త్ (Vs) స్వ‌రాభాస్క‌ర్: మ‌హిళ‌ల‌ 'ఆత్మ‌బ‌లిదానం'పై మ‌ళ్లీ అగ్గి రాజుకుంది!

ప్రముఖ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ముక్కు సూటి వ్య‌వ‌హారం నిరంత‌రం వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  M Prashanth   |   2 Sept 2026 9:04 AM IST
ప‌ద్మావ‌త్ (Vs) స్వ‌రాభాస్క‌ర్: మ‌హిళ‌ల‌ ఆత్మ‌బ‌లిదానంపై మ‌ళ్లీ అగ్గి రాజుకుంది!
X

ప్రముఖ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ముక్కు సూటి వ్య‌వ‌హారం నిరంత‌రం వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. గతంలో `పద్మావత్` చిత్రం విడుదలైన సమయంలో స్వ‌రా ఒక లేఖ రాయ‌గా వివాదాస్ప‌ద‌మైంది. ఇప్పుడు ఆ బహిరంగ లేఖపై న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మళ్లీ స్పందించారు. 2018లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో `జోహార్` (ఆత్మబలిదానం) దృశ్యాలను వైభవంగా చూపించడాన్ని స్వ‌రా తీవ్రంగా తప్పుబట్టారు. సినిమాలో వేలాది మంది మహిళలు తమ ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించడాన్ని చూపిస్తే... సమాజంలోని అత్యాచార బాధితులు తాము జీవించి ఉండటం పిరికితనమేమో అని భావించే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని స్వ‌రా వ్యక్తం చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

న్యూఢిల్లీ వేదికగా మాట్లాడిన స్వరా భాస్కర్.. ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు తన మనసులో మెదిలిన ఆలోచనలను షేర్ చేసారు. ``ఒకవేళ నేను అత్యాచార బాధితురాలినైతే... ఈ సినిమా నాకు ఏం సందేశం ఇస్తోంది? ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు తీసుకోలేకపోయాననే పిరికితనం నన్ను వెంటాడుతుందా?`` అని ప్రశ్నించారు. ముఖ్యంగా గర్భిణి పాత్ర కూడా జోహార్‌లో పాల్గొనడాన్ని చూపిస్తూ రూపొందించిన షాట్‌పై స్వ‌రాభాస్క‌ర్ అసహనం వ్యక్తం చేశారు. దాడికి గురవుతారనే భయంతో పుట్టబోయే బిడ్డకు జీవించే హక్కు లేకుండా చేయడాన్ని ఆక్షేపిస్తూ.. `ప‌ద్మావ‌త్` సినిమాను చూసిన ఐదు రోజుల ఆలోచన తర్వాతే ఆ లేఖ రాశానని స్పష్టం చేశారు.

స్వరా భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ..``జోహార్ అనేది కేవలం ఒక అత్యాచార సంఘటనకు క్షణికావేశంలో ఇచ్చిన సమాధానం కాదు. ఓటమి తర్వాత శత్రువుల చేతిలో బానిసత్వం, లైంగిక హింస, తీవ్ర అవమానాల నుంచి తప్పించుకోవడానికి చారిత్రక పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం`` అని పేర్కొన్నారు. అత్యాచార బాధితుల మానసిక వేదనను అర్థం చేసుకోకుండా.. నైతిక ప్ర‌శ్న‌ల‌తో ముడిపెట్టి మాట్లాడవద్దని నటి స్వ‌రాకు సూచించారు. మరికొందరు నెటిజన్లు చారిత్రక వాస్తవాలను.. ఆనాటి భయంకరమైన పరిస్థితులను విస్మరించి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

అయితే ఈ వ్యవహారంలో కొందరు స్వరా భాస్కర్‌కు మద్దతుగా నిలిచారు. జోహార్ చేసిన మహిళల త్యాగాన్ని తక్కువ చేసి చూపించడం ఆమె ఉద్దేశం కాదని.. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ప్రాణాల కంటే `ప్రాచీన విలువ‌లు- గౌరవానికే` ప్రాధాన్యత ఇవ్వాలనే భావజాలాన్ని నాటి సమాజం నూరిపోసిందని వివరించారు. మోడ్ర‌న్ సినిమాలో అటువంటి దృశ్యాలను మహిమాన్వితంగా చూపడం వల్ల నేటి సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందనే కోణంలోనే స్వ‌రా ప్రశ్నించారని.. సినిమాలోని సందేశాన్నే విమర్శిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

సూఫీ కవి మాలిక్ ముహమ్మద్ జయాసీ రాసిన `పద్మావత్` మహాకావ్యం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్తోడ్ ఘోర ముట్టడి సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దళాల చేతికి చిక్కకుండా రాణి పద్మినితో పాటు వందలాది మంది రాజ్‌పుత్ మహిళలు అగ్నికి ఆహుతయ్యే దృశ్యాలు ఈ చిత్రంలో ప్రధాన ఘట్టంగా నిలిచాయి. మహిళల ఆత్మగౌరవ పోరాటానికి సంకేతంగా కొందరు జోహార్‌ను పరిగణిస్తే.. ఆధునిక సమాజంలో స్త్రీ జీవించే హక్కును ప్రశ్నించేలా దానిని వర్ణించడం సరికాదని భావించే వారి మధ్య ఈ చర్చ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. అయితే ఒక‌రికి బానిస అయి ప్ర‌తిరోజూ అత్యాచారానికి గురైతే, హింస‌ను ఎదుర్కొంటే ఆ ఆవేదన ఎలా ఉంటుందో స్వ‌రా భాస్క‌ర్ తెలుసుకోవాల‌ని కూడా కొంద‌రు వ్య‌తిరేకించారు.