Begin typing your search above and press return to search.

మ‌గాడిని బాధితుడిగా చూపిస్తేనే భారత‌దేశంలో సినిమాలు ఆడ‌తాయి!

సినిమాలు, రాజ‌కీయాల‌పై బాలీవుడ్ న‌టి స్వ‌రాభాస్క‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు నిరంత‌రం హెడ్ లైన్స్‌లోకొస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   27 Sept 2025 8:30 AM IST
మ‌గాడిని బాధితుడిగా చూపిస్తేనే భారత‌దేశంలో సినిమాలు ఆడ‌తాయి!
X

సినిమాలు, రాజ‌కీయాల‌పై బాలీవుడ్ న‌టి స్వ‌రాభాస్క‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు నిరంత‌రం హెడ్ లైన్స్‌లోకొస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో `రాంజానా` సినిమాలో `మేల్ బాధిత కార్డ్` గురించి బ‌హిరంగంగా మాట్లాడి తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా ఫెమినిజాన్ని చూపించ‌బోయి, కెరీర్ లో చాలా మంచి అవ‌కాశాల‌ను కోల్పోయింది స్వ‌రా. ఈ నిజాన్ని తాను అంగీక‌రించేందుకు వెన‌కాడ‌దు. చాలా మంది నిర్మాత‌లు స్వ‌రాను దూరం పెట్టారు. చాలా బ్రాండ్లు కూడా స్వ‌రాతో ప్ర‌చారం చేయించుకునేందుకు వెన‌కాడాయి. ముక్కుసూటిత‌నం, ఫెమినిజం కార‌ణంగా ఈ ప్ర‌తిభావంతురాలైన న‌టి చిక్కుల్లో ప‌డింది.

ఇప్పుడు మ‌రోసారి స్వ‌రా భాస్క‌ర్ సూటిగా భార‌తీయ సినిమాల్లో లోపాల‌ను విమర్శించింది. మ‌గాడిని బాధితుడిగా చూపిస్తేనే ఇక్క‌డ సినిమాలు చూస్తార‌ని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ లోపాన్ని తాను రాంజానా సినిమా చేస్తున్న‌ప్పుడే గుర్తించాన‌ని, ఆ త‌ర్వాత మీడియా స‌మావేశంలో జ‌ర్న‌లిస్టు నుంచి ఇలాంటి ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌ను స‌మాధానం ఇవ్వొద్ద‌ని హెచ్చ‌రించాన‌ని కూడా స్వ‌రా చెప్పింది. ర‌చ‌యిత హిమాన్షు ప్ర‌తిభావంతుడైన ర‌చ‌యిత అని, ఆనంద్ ఎల్ రాయ్ అద్భుతంగా తెర‌పై క‌థానాయ‌కుడిని చూపిస్తార‌ని పేర్కొంది.

కేవ‌లం రాంజానా (ధ‌నుష్, సోన‌మ్ ఇత‌ర న‌టీన‌టులు) మాత్ర‌మే కాదు.. ఇతర హిట్ సినిమాల్లోను ఇలాంటి లోపాలున్నాయ‌ని స్వ‌రా పేర్కొంది. భారతదేశం `నస్కతుయే ఆషిక్ సినిమా`లతో నిండి ఉందని నేను మీకు చెప్పగలనా? మీకు కావలసినది మీరు చేయండి.. ఇది మ‌గాళ్ల‌కు ఇష్టమైన విషయం అని నేను భావిస్తున్నాను.. వారు బాధితులుగా ఉండాలని కోరుకుంటారు. ఏదో ఒక విధంగా బాధితుడి పాత్ర‌ను పోషించడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు... అని స్వ‌రా ఘాటుగానే విమ‌ర్శించింది.

చ‌రిత్ర‌లో మ‌న హిట్ సినిమాల‌న్నీ చూస్తే.., రాంఝనాలో పేదవాడు చివరికి చనిపోతాడు. సయ్యారా చూస్తే, పేదవాడు ప్రేమలో ప‌డ‌తాడు కానీ అమ్మాయి వేరొకరి పేరును చెబుతుంది! కాస్త పాత‌కాలంలోకి వెళితే.. దేవదాస్ (ప్రియురాలి బాధితుడు) లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి... ప్రతి పెద్ద హిట్ సినిమా.. పురుషుడినే బాధితుడిగా చూపిస్తుంది! అని పేర్కొంది స్వ‌రా.