Begin typing your search above and press return to search.

మద్రాస్ ఎప్‌స్టీన్ వేధింపులు త‌ట్టుకోలేకే.. సంగీత దర్శ‌కుడిపై గాయ‌ని ఆరోప‌ణ‌లు!

తమిళ చిత్ర పరిశ్రమలో `ఏనో పెన్నే`, `కాదల్ కన్మణి` వంటి పాపులర్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ స్వాగత ఎస్ కృష్ణన్.. ఒక ప్రముఖ సంగీత దర్శకుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు.

By:  Sivaji Kontham   |   29 April 2026 9:28 PM IST
మద్రాస్ ఎప్‌స్టీన్ వేధింపులు త‌ట్టుకోలేకే.. సంగీత దర్శ‌కుడిపై గాయ‌ని ఆరోప‌ణ‌లు!
X

తమిళ చిత్ర పరిశ్రమలో `ఏనో పెన్నే`, `కాదల్ కన్మణి` వంటి పాపులర్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ స్వాగత ఎస్ కృష్ణన్.. ఒక ప్రముఖ సంగీత దర్శకుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సంగీత దర్శకుడిని `మద్రాస్ ఎప్‌స్టీన్‌` అని సంబోధించారు. ఈ చేదు అనుభవాల కారణంగానే తాను తమిళ సంగీత పరిశ్రమకు దూరమై.. మానసిక ప్రశాంతత కోసం రిషికేశ్‌కు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంగీత దర్శకుడి రికార్డింగ్ స్టూడియోలోనే ఈ అకృత్యాలు జరిగాయని స్వాగత వివరించారు. వృత్తిపరంగా సురక్షితమైన ప్రదేశమని తాను నమ్మిన ఆ స్టూడియో.. ఒక నియంత్రిత వలయమని గాయ‌ని స్వాగ‌త‌ పేర్కొన్నారు. సౌండ్‌ప్రూఫ్ గదులు ఉండటం.. సెషన్స్ సమయంలో గదులను లాక్ చేయడం.. రహస్య సీసీటీవీ కెమెరాల నిఘాలో బాధితులను ఒంటరిని చేసేవారని స్వాగ‌త కృష్ణ‌న్ ఆరోపించారు. ఒకవేళ సహాయం కోసం అరిచినా ఎవరికీ వినిపించని అభద్రత మధ్య తాను చిక్కుకున్నానని ఆమె ఆ భయంకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.

మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. స్టూడియోలో జరిగిన సంఘటనలను రహస్యంగా రికార్డ్ చేసి.. ఆ వీడియో ఫుటేజ్‌తో తనను బెదిరించారని స్వాగత ఆరోపించారు. కేవలం తననే కాకుండా.. అక్కడికి వచ్చే మహిళలను.. చివరకు పిల్లలను కూడా రహస్యంగా రికార్డ్ చేయడం ఆ సంగీత దర్శకుడికి అలవాటని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియోల ద్వారా బాధితులను బ్లాక్‌మెయిల్ చేస్తూ.. వారు నోరు విప్పకుండా నియంత్రించేవారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఈ వేధింపుల వల్ల తానూ ఎదుర్కొన్న మానసిక క్షోభ వర్ణనాతీతమని స్వాగత తెలిపారు. వృత్తిపరమైన సర్కిల్స్‌లో తనపై తప్పుడు ప్రచారం చేశారని... నిందితుడి కుటుంబ సభ్యులు కూడా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు సృష్టించారని వాపోయారు. దీనివల్ల తీవ్రమైన ఆందోళన కు లోనైన తాను.. రోజుల తరబడి గదికే పరిమితమై థెరపీ తీసుకోవాల్సి వచ్చిందని.. తన సోదరి అండతోనే ఈ క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడగలిగానని వెల్లడించారు.

గతంలో భయం వల్ల.. సరైన మద్దతు లేకపోవడం వల్ల ఫిర్యాదు చేయలేకపోయానని.. కానీ ఇప్పుడు చట్టపరమైన పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని స్వాగత స్పష్టం చేశారు. ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించానని.. మరెవరూ ఇటువంటి వేధింపులకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నానని స్వాగ‌త కృష్ణ‌న్ తెలిపారు. ఇప్పటివరకు ఆ సంగీత దర్శకుడి పేరును వెల్లడించక‌పోయినా.. జవాబుదారీతనం కోసం స‌ద‌రు గాయ‌ని తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్ర‌స్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో ఎవ‌రు ఈ మ‌ద్రాస్ ఎప్ స్టీన్? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.