రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ షురూ... ఇదే చివరిదా?
టాలీవుడ్ చరిత్రలో నిలిచి పోయే విధంగా సినిమాలు తీసిన గొప్ప దర్శకులు చాలా మంది ఉన్నారు.
By: Ramesh Palla | 29 Aug 2025 2:00 PM ISTటాలీవుడ్ చరిత్రలో నిలిచి పోయే విధంగా సినిమాలు తీసిన గొప్ప దర్శకులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1990ల్లో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా యమలీల, ఘటోత్కచుడు, శుభలగ్నం, నెంబర్ 1 ఇలా చాలా సినిమాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఆయన వేసిన కామెడీ ట్రాక్, ఆయన చేసిన స్పెషల్ సాంగ్స్ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అంటే ఆయన స్థాయి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. అంతటి గొప్ప దర్శకుడు ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు ఎందుకు తీస్తున్నాడా అని ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్‌లుగా నిలుస్తున్నాయి.
యమలీల 2 ఫ్లాప్
గత 20 ఏళ్లుగా రెడ్డి గారి నుంచి వచ్చిన సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ కాలేదు. కొన్ని సినిమాలు వచ్చాయనే విషయం కూడా ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ వర్గాల వారికి, మీడియా సర్కిల్స్‌లోనూ తెలియదు, గుర్తు లేదు. తన సూపర్ హిట్ మూవీ యమలీల ను మళ్లీ చూపించాలనే ఉద్దేశంతో యమలీల 2 ను చేసిన రెడ్డి గారు తీవ్రంగా నిరుత్సాహ పరిచారు. ఆ సినిమా తర్వాత దాదాపు పదేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా సైతం డిజాస్టర్‌గా నిలిచింది. ఇరవై ఏళ్లుగా హిట్ లేకున్నా ఎస్వీ కృష్ణ రెడ్డి సినిమాలను తీయడం మాత్రం మానడం లేదు. ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న హిట్‌ను కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.
దిల్ రాజు, వినాయక్ గెస్ట్‌లుగా
ఎస్వీ కృష్ణారెడ్డి చాలా కాలంగా 'వేదవ్యాస' అనే సినిమాను చేయాలి అనుకుంటున్నాడట. ఈ కథ ఆయన వద్దకు వచ్చి చాలా కాలం అయింది. కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ సమయంలో ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకోవడం ఖచ్చితంగా పెద్ద విషయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ లేడీ ఓరియంటెడ్ కథను రెడ్డి గారు మొదలు పెట్టారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వినాయక్, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివి వినాయక్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాతో రెడ్డి గారు మళ్లీ ఫామ్‌లోకి రావాలని అతిథులు ఆకాంక్షిస్తూ తమ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ వెంటనే మొదలు పెట్టబోతున్నట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ వేదవ్యాస
ఈ సినిమా కథ రీత్యా హీరోయిన్‌ను సౌత్ కొరియా నుంచి దించారని తెలుస్తోంది. కొరియన్ నటి జున్ హ్యూన్ జీ ఇప్పటికే ఇండియా వచ్చింది. ఆమెపైనే క్లాప్ కొట్టి మరీ షూటింగ్ ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఏకధాటిగా షూటింగ్ చేస్తారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సున్నితమైన అంశాలను చూపించబోతున్నట్లు ఎస్వీ కృష్ణారెడ్డి సన్నిహితులు అంటున్నారు. ఇప్పటికే హిట్ లేక ఢీలా పడ్డ కృష్ణారెడ్డి ఈ సినిమాతో అయినా పుంజుకుంటారా అనేది చూడాలి. ఇండస్ట్రీలో మాత్రం కొందరు ఈ సినిమా రెడ్డి గారి చివరి సినిమా కావచ్చు అని విశ్లేషిస్తున్నారు. ఆయన మాత్రం ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు, కానీ చివరి సినిమా అని మాత్రం అనడం లేదు. కనుక ఆయన నుంచి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
