రెట్టించిన ఉత్సాహంలో మెగా డాటర్ న్యూ ఆఫీస్!
మెగా డాటర్ సుస్మిత స్థాపించిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పై నిర్మించిన తొలి సినిమా `శంకర వరప్రసాద్ గారు`తో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 24 Jan 2026 1:37 PM ISTమెగా డాటర్ సుస్మిత స్థాపించిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పై నిర్మించిన తొలి సినిమా `శంకర వరప్రసాద్ గారు`తో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే తండ్రి చిరంజీవితో కలిసి పని చేసే అవకాశం సుస్మితకు దక్కింది. ఆ రకంగా సుస్మిత లక్కీ. చిరంజీవికి బయట బ్యానర్ల నుంచి కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ ఉన్నా? వాటిని కాదని కుమార్తె కోసం సినిమా చేసి పెట్టారు. తొలి సినిమాతోనే తనయ సక్సెస్ అవ్వడంతో చిరంజీవి సహా ఆ కటుంబం ఎంతో సంతోషంగా ఉంది. మరో భాగస్వామి సాహూ గారపాటి ఉన్నా? సుస్మిత పేరు ఎక్కువగా హైలైట్ అయింది.
అందులోనూ సినిమా 300 కోట్ల వసూళ్లను సాధించడంతో? మరింత సంచలనంగా మారింది. అయితే గోల్డ్ బ్యాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ కు ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి ఆఫీస్ లేదు. `మన శంకర వరప్రసాద్ గారు` షూటింగ్ అంతా షైన్ స్క్రీన్స్ ఆఫీస్ సహకారంతో ముగించారు. ఈ నేపథ్యంలో తాజాగా సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ కు సంబంధించి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. `న్యూ చాప్టర్ బిగిన్స్` అంటూ కార్యాలయం ఫోటోలను పోస్ట్ చేసారు.
ఈ సందర్భంగా భవిష్యత్ లో ఇదే సంస్థ నుంచి మరిన్ని సినిమాలు నిర్మిస్తానని సుస్మిత వెల్లడించారు. అయితే సుస్మిత నిర్మించబోయే రెండవ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. ఏ హీరోతో ఆమె సినిమా నిర్మిస్తారు? అతడు మెగా హీరో అవుతాడా? బయట హీరో అవుతాడా? ఆ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఇలా చాలా ప్రశ్నలు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. తొలి సినిమా పక్కా కమర్శియల్ చిత్రం. పైసా వసూల్ కంటెంట్ ఇది. ఈ నేపథ్యంలో సుస్మిత ఇలాంటి కథలకే అధిక ప్రాధాన్యత ఇస్తారా? ప్రయోగాత్మక కథలు కూడా నిర్మిస్తారా? అన్న డిస్కషన్ జరుగుతోంది.
ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మహేష్, బన్నీ, తారక్, రామ్ చరణ్ , ప్రభాస్ వీళ్లంతా పాన్ ఇండియా స్టార్లు. వీళ్లతో సినిమాలు నిర్మించాలంటే వందల కోట్లు ఖర్చు చేయాలి. మరి సుస్మిత అందుకు సిద్దంగా ఉన్నారా? లేక రీజనల్ మార్కెట్ ఫరిదిలోనే సినిమాలు నిర్మిస్తారా? అన్నది చూడాలి. కానీ తమ్ముడు రామ్ చరణ్ తో మాత్రం మంచి సినిమా నిర్మించాలని సుస్మిత మనసులో బలమైన కోరిక ఉంది. అదే కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ తో సినిమా నిర్మించడం కూడా సుస్మితకు ప్రతిష్టాత్మకమైందే. కానీ వారిద్దరితో ఛాన్స్ కూడా అంత సులభం కాదు.
