వెంకీకి ఎంత ఇచ్చినా అది మాకు సంతృప్తి: మెగా నిర్మాత
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుస్మిత మాట్లాడుతూ.. వెంకీ ఈ చిత్రం విజయానికి పెద్ద సహకారి అని అన్నారు.
By: Sivaji Kontham | 23 Jan 2026 9:55 PM ISTమెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన `మన శంకర వరప్రసాద్ గారు` 2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సైలెంట్ గా 400కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతోంది. పరిమిత సమయం, మధ్యస్త బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం భారీ లాభాలివ్వడంతో పంపిణీ వర్గాలు సహా నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
అయితే ఈ సినిమాలో నటించిన వెంకటేష్ కి నిర్మాతలు ఎంత పారితోషికం అందజేసారు? అనేది సస్పెన్స్ గా ఉంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. వెంకటేష్ సాధారణంగా తన సినిమాలకు రూ.12 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. అయితే సుస్మిత కొణిదెల సినిమాకు సంబంధించి రూ.15 కోట్లు పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో కూడా కొంత వాటా ఉండేలా అగ్రిమెంట్ జరిగిందని కథనాలొచ్చాయి.
మెగా ఫ్యామిలీతో వెంకటేష్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలతో పాటు, కథ నచ్చడంతో వెంకీ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. పారితోషికం విషయంలో ఆయన పెద్దగా పట్టుబట్టకుండా, మార్కెట్ ధర ప్రకారమే తీసుకున్నట్లు కథనాలొచ్చాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుస్మిత మాట్లాడుతూ.. వెంకీ ఈ చిత్రం విజయానికి పెద్ద సహకారి అని అన్నారు. ఆయన తెరపై కనిపించడం సినిమా విలువను పెంచింది. ఆయనకు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలన్నా అది మాకు ప్లెజర్ (సంతోషం- సంతృప్తి) లాంటిది. ఆయన చాలా పాజిటివ్ పర్సనాలిటీ కూడా`` అని తెలిపారు. క్లైమాక్స్ ముందు వెంకీ సన్నివేశాలు అద్భుతంగా పండాయని, వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చిందని తెలిపారు. వెంకటేష్ కి పారితోషికం ఇవ్వడం చాలా సంతృప్తిని ఇచ్చిందని సుస్మిత అన్నారు.
ఈ చిత్రాన్ని సాహో గారపాటితో కలిసి సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మెగా బాస్ తో కలిసి వెంకటేష్ మార్కు కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుటవ్వడంతో సంక్రాంతి పండగలో భారీ వసూళ్లను సాధించింది.
సుస్మిత కొణిదెల ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, చిన్న బడ్జెట్ సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి- వెంకటేష్ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ చేయడం తన కెరీర్‌లో ఒక పెద్ద అడుగు.
