నష్టాలొస్తే థియేటర్లను వదిలేయండి.. ఎగ్జిబిటర్ల తీరుపై నిర్మాత నాగవంశీ ఫైర్!
ఈ సమస్యకు పరిష్కారంగా నాగవంశీ ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. నష్టాల్లో ఉన్న ఆ థియేటర్లను వదిలేయాలని.. తాము (నిర్మాతలు) వాటిని టేకోవర్ చేసి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
By: Sivaji Kontham | 14 May 2026 9:18 AM ISTతెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు.. నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్ల రంగాన్ని ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో జరుగుతున్న ఈ చర్చా సమావేశాలు కాస్త వాదోపవాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా జరిగిన సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎగ్జిబిటర్ల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. పరిశ్రమ మనుగడ కోసం అందరూ కలిసి పని చేయాల్సిన సమయంలో కొన్ని నిబంధనల పేరుతో అడ్డుతగలడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఛాంబర్ సమర్పించిన 23 థియేటర్ల జాబితాపై నాగవంశీ సూటిగా స్పందించారు. ఈ థియేటర్లలో కేవలం పర్సంటేజీ ప్రాతిపదికన మాత్రమే సినిమాలను విడుదల చేస్తామని ఎగ్జిబిటర్లు చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. ఒకవేళ ఆ థియేటర్ల నిర్వహణ వల్ల నిరంతరం నష్టాలే వస్తున్నాయని వారు భావిస్తే..అటువంటి నష్టదాయకమైన థియేటర్లను పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారని ఆయన నిలదీశారు. నష్టాలు వచ్చే చోట మొండిగా కొనసాగడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమస్యకు పరిష్కారంగా నాగవంశీ ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. నష్టాల్లో ఉన్న ఆ థియేటర్లను వదిలేయాలని.. తాము (నిర్మాతలు) వాటిని టేకోవర్ చేసి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా ఈ 23 థియేటర్లు లీజుకు తీసుకున్న వారు (లెస్సీలు) నిర్వహిస్తున్నవేనని.. వారు తప్పుకుంటే తాము నేరుగా అసలైన యజమానులతో మాట్లాడతామని చెప్పారు. తద్వారా నిర్మాతలకు, థియేటర్ ఓనర్లకు ఇరువురికీ లాభం చేకూరేలా పారదర్శకమైన విధానంలో సినిమాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
థియేటర్ల నిర్వహణకు సంబంధించి విశాఖపట్నం వంటి నగరాలను ఆయన ఉదాహరణగా చూపారు. వైజాగ్‌లోని జగదాంబ, సంగం-శరత్ వంటి సింగిల్ స్క్రీన్లు కాలంతో పాటు అద్భుతంగా అభివృద్ధి చెందాయని, అందుకే అవి నేటికీ భారీ లాభాలను గడిస్తున్నాయని గుర్తు చేశారు. అదే తరహాలో హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్లను కూడా ఎందుకు ఆధునీకరించకూడదని ఆయన ప్రశ్నించారు. కేవలం మల్టీప్లెక్సుల మీదనే శ్రద్ధ పెట్టకుండా.. సింగిల్ స్క్రీన్లను కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని హితవు పలికారు.
చివరగా..చిత్ర పరిశ్రమలోని వారంతా ఒకే తాటిపై ఉండాలని నాగవంశీ కోరారు. ``మనం ఒకే బోటులో ప్రయాణిస్తున్నాం..ఒకరినొకరు విడిచిపెట్టి ముందుకు సాగలేం`` అని వ్యాఖ్యానించారు. నష్టాలు వస్తున్నాయని సాకులు చెబుతూ థియేటర్ల అభివృద్ధిని అడ్డుకోవద్దని.. నిర్మాతలు- ఎగ్జిబిటర్లు సమన్వయంతో ముందుకు సాగినప్పుడే పరిశ్రమ బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు. ఈ చర్చలు కేవలం మాటలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో మార్పుకు దారితీయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
