Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డులే కాదు 'ఆస్కార్'కి వెళ్లినా ఆశ్చర్యం లేదు: శివ నిర్వాణ‌

సముద్రం, మత్స్యకారుల బోట్ రేసింగ్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

By:  Sivaji Kontham   |   6 Sept 2026 3:54 PM IST
జాతీయ అవార్డులే కాదు ఆస్కార్కి వెళ్లినా ఆశ్చర్యం లేదు: శివ నిర్వాణ‌
X

త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా రాణిస్తున్నాడు సూరి. అదే తీరుగా తెలుగులో హీరోగా స‌త్తా చాటాడు సుహాస్. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒక పాన్ ఇండియ‌న్ సినిమా చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇది రేర్ కాంబినేష‌న్. ఈ సినిమా టైటిల్ మందాడి. ఇటీవల అట్టహాసంగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ వేదికపై అత్యంత భావోద్వేగంగా ప్రసంగించారు. సాధారణంగా వేరే ఈవెంట్లకు వెళ్లినప్పుడు హృద‌యం సంతోషంతో లేదా గర్వంతో నిండుతుందని... కానీ తొలిసారిగా ఈ వేదికపైకి రాగానే మాట్లాడలేనేమో అనేంతగా ఎమోషనల్ అయ్యానని పేర్కొన్నారు. ఈ వేడుకలో గాయకుడు అభినవ్ పాడిన పాట.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. తన త‌దుప‌రి చిత్రంలో అభినవ్‌తో క‌చ్చితంగా ఒక పాట పాడిస్తానని శివ నిర్వాణ వెల్లడించారు.

ఈ సందర్భంగా తమిళ నటుడు సూరి విలక్షణ నటనా శైలిని.. అత‌డి అజేయ‌మైన‌ సినీ ప్రయాణాన్ని ఎంత‌గానో కొనియాడారు. గరుడన్, విడుదల-1 చిత్రాల్లో సూరి నటనకు తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని.. వెట్రిమారన్ - ఇళయరాజా వంటి దిగ్గజాలతో పనిచేసే అవకాశం లభించడం అతడి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. బయటకు ఎంతో వినమ్రంగా కనిపించే సూరి.. తెరపై మాత్రం పూర్తి భిన్నమైన, అత్యంత శక్తివంతమైన నటనను ప్రదర్శిస్తారని ప్రశంసించారు.

`మందాడి` టీజర్, ట్రైలర్‌లలోని బోట్ షాట్స్, విజువల్స్ .. చిత్రబృందం పడిన కష్టాన్ని చూసి తాను అబ్బురపడ్డానని ఆయన తెలిపారు. ఎక్కడా గ్రీన్ మ్యాట్ లేదా చీటింగ్ షాట్స్ లేకుండా ఒరిజినల్ లొకేషన్లలో.. రియల్ బ్లడ్ అండ్ స్వెట్‌తో దర్శకుడు మది ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొనియాడారు. ప్రేక్షకులు కొనే ప్రతి టికెట్‌కి పూర్తి న్యాయం చేసేలా ఉద్వేగభరితంగా ఉన్న ఈ చిత్రం జాతీయ అవార్డులతో పాటు ఆస్కార్ స్థాయికి వెళ్లినా ఆశ్చర్యం లేదన్నారు.

నటుడు సుహాస్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. `మజిలీ`లో `జాంటీ` పాత్ర ద్వారా పరిచయమైన సుహాస్, `కలర్ ఫోటో`తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడని శివ నిర్వాణ చెప్పారు. ఈ సినిమాలో సుహాస్ నటన చూసి `వీడు సుహాసేనా` అని ఆశ్చర్యపోయానని.. అతడిని నమ్మి ఒక తమిళ చిత్రంలో అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రను ఇచ్చినందుకు హీరో సూరికి.. తమిళ చిత్రబృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తన `ఇరుముడి` చిత్రంతో పాటు `మందాడి`కి అద్భుతమైన స్వరాలు అందించిన జీవీ ప్రకాష్ కుమార్‌ను జెమ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అని అభివర్ణించారు.

సముద్రం, మత్స్యకారుల బోట్ రేసింగ్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌రెడ్ కుమార్ నిర్మించగా.. వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రానికి మధిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. కోలీవుడ్ యాక్టర్ సూరి (ముత్తుకాళి పాత్రలో) కథానాయకుడిగా నటించగా.. సుహాస్ `పులి` అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించారు. మ‌హిమా నంబియార్ కథానాయికగా న‌టించ‌గా.. సత్యరాజ్, అచ్యుత్ కుమార్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో మెరిశారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, ఎస్.ఆర్. కథీర్ సినిమాటోగ్రఫీ అందించిన సినిమా ఇది. తాజా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో శివ నిర్వాణతో పాటు దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాతలు శశి, నవీన్ ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.