Begin typing your search above and press return to search.

దగ్గుబాటి ఫ్యామిలీపై వార్తలు.. సురేష్ బాబు ఫుల్ ఫైర్!

ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తమ కుటుంబంపై వస్తున్న వార్తలపై స్పందించారు.

By:  M Prashanth   |   10 Jan 2026 3:36 PM IST
దగ్గుబాటి ఫ్యామిలీపై వార్తలు.. సురేష్ బాబు ఫుల్ ఫైర్!
X

ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తమ కుటుంబంపై వస్తున్న వార్తలపై స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఖండించారు. డెక్కన్ కిచెన్ కేసులో తన ఫ్యామిలీకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఆదేశాలు ఇచ్చారని, ఈ నెల 23న కుటుంబ సభ్యులు హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని వస్తున్నవి అవాస్తవమని తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు సురేష్ బాబు.

సురేష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 నవంబర్ 14వ తేదీన హైదరాబాద్‌ లోని XVII అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో తమ వ్యక్తిగత హాజరుపై ఎలాంటి అత్యవసరం లేదని, అలాగే తమపై లేదా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా నమోదు చేసింది.

ఆ రోజు ఈ వ్యవహారాన్ని కేవలం క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ల పరిష్కారం కోసం మాత్రమే 2026 జనవరి 9కు వాయిదా వేసినట్లు తెలిపారు. అలాగే 2026 జనవరి 9వ తేదీన కూడా కోర్టు ఈ కేసును కేవలం క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ల పరిష్కారానికే విచారణకు తీసుకుందని, వ్యక్తిగత హాజరు అవసరం లేదని మరోసారి స్పష్టమైందని సురేష్ బాబు పేర్కొన్నారు.

అయినప్పటికీ స్పష్టమైన న్యాయపరమైన వాస్తవాలను పక్కనపెట్టి, ఇటీవల ఓ ఇంగ్లీష్ దినపత్రిక సంచలనాత్మకంగా, తప్పుదారి పట్టించేలా వార్త ప్రచురించిందని ఆరోపించారు. ఆ విధమైన తప్పుడు కథనాలు ప్రజల్లో గందరగోళం సృష్టించడమే కాకుండా, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తాను ఎప్పుడూ న్యాయ ప్రక్రియకు పూర్తిస్థాయిలో ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నానని తెలిపారు.

న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు సురేష్ బాబు. తప్పుడు వార్తలను ప్రచురించిన బాధ్యులపై చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని హక్కులను తాను వినియోగించుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడైనా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వార్తలు ప్రచురించే ముందు అధికారిక న్యాయ రికార్డులను సరిచూసుకుని మాత్రమే కథనాలు ఇవ్వాలని ఆయన సూచించారు.

ఏదేమైనా మీడియా సంస్థలు బాధ్యతాయుత జర్నలిజాన్ని పాటించాలని కోరారు. వ్యక్తుల గౌరవం, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా నిరాధార కథనాలు ప్రచురించడం సరికాదని ఆయన తన ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తానికి దగ్గుబాటి కుటుంబంపై వచ్చిన ఆరోపణలు, ప్రచురితమైన వార్తలు వాస్తవానికి దూరమని క్లారిటీ ఇచ్చారు సురేష్ బాబు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు దీనికి సాక్ష్యమని స్పష్టం చేశారు.