Begin typing your search above and press return to search.

కిక్‌ ఇచ్చిన దర్శకుడు అసలు ప్రయత్నిస్తున్నాడా...?

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 20 ఏళ్లలో కేవలం పది సినిమాలు తీసిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి. తీసిన సినిమాల్లో ఎక్కువ శాతం స్టార్‌ హీరోలతో కావడం ఈ దర్శకుడి స్పెషాలిటీ.

By:  Ramesh Palla   |   9 Oct 2026 11:00 PM IST
కిక్‌ ఇచ్చిన దర్శకుడు అసలు ప్రయత్నిస్తున్నాడా...?
X

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 20 ఏళ్లలో కేవలం పది సినిమాలు తీసిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి. తీసిన సినిమాల్లో ఎక్కువ శాతం స్టార్‌ హీరోలతో కావడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. మొదటి సినిమా తప్పితే మిగిలిన అన్ని సినిమాలు స్టార్‌ హీరోలతో అయినప్పటికీ సురేందర్‌ రెడ్డికి దక్కాల్సిన స్టార్‌డం దక్కలేదు. కానీ స్టైలిష్‌ ఫిల్మ్‌ మేకర్‌ అని, మంచి వినోదభరిత సినిమాలు తీస్తాడనే పేరు మాత్రం దక్కించుకున్నాడు. కిక్‌ సినిమాతో సురేందర్‌ వెంట స్టార్‌ హీరోలు పడ్డారు. కానీ సురేందర్‌ రెడ్డి తనకు వచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా ప్రతిసారి పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తాను అని భీష్మించుకు కూర్చోవడంతో సురేందర్‌ రెడ్డి రెండు దశాబ్దాల కాలంలో కేవలం పది సినిమాలు మాత్రమే చేశాడు. ఇప్పటికీ ఆయన డేట్స్‌ అడిగితే ఇచ్చేందుకు చాలా మంది యంగ్‌ హీరోలు రెడీగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం పెద్ద హీరో కోసం వెయిట్‌ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

చిరంజీవితో సైరా నరసింహారెడ్డి...

మెగాస్టార్‌ చిరంజీవితో తీసిన సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డికి గ్యాప్‌ వచ్చింది. ఆ సినిమా మంచి ఫలితాన్ని దక్కించుకున్నా సురేందర్ రెడ్డి అంతకు మించిన మంచి సినిమాతో రావాలనే పట్టుదలతో ఏకంగా నాలుగు ఏళ్లు ఆగి అఖిల్‌ తో 'ఏజెంట్‌' సినిమాను తీసిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్‌తో సురేందర్‌ రెడ్డి తీసిన ఏజెంట్‌ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ సినిమాను మీడియం బడ్జెట్‌తో, పెద్దగా అంచనాలు లేకుండా తీసి ఉంటే తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునేది అని కొందరి విశ్లేషకుల మాట. ఆ విషయం పక్కన పెడితే సురేందర్ రెడ్డి ఏజెంట్‌ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. ఆ మధ్య పవన్‌ కళ్యాణ్‌కు కథ చెప్పడం, ఓకే చెప్పించుకోవడం జరిగింది. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా అంటూ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు.

పవన్ కళ్యాణ్‌తో సురేందర్‌ రెడ్డి మూవీ...

పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కొత్త సినిమాలు మొదలు పెట్టలేదు. అప్పటికే షూటింగ్‌ ప్రారంభించిన సినిమాలను పూర్తి చేయడం జరిగింది. సురేందర్‌ రెడ్డి సినిమా ప్రకటన అయితే వచ్చింది కానీ సినిమా పట్టాలు ఎక్కలేదు. దాంతో పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు కొత్తగా సురేందర్‌ రెడ్డితో సినిమాకు డేట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయినా కూడా సురేందర్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే కొత్త సినిమాను మొదలు పెట్టే యోచన కూడా చేయడం లేదు. ఏజెంట్‌ ఫలితం, ఏకంగా మూడు ఏళ్ల గ్యాప్‌ కారణంగా సురేందర్‌ రెడ్డితో సినిమా అంటే స్టార్‌ హీరోలు కాస్త వెనుక ముందు ఆడే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా సురేందర్‌ రెడ్డి స్టార్‌ హీరోల వైపే చూస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలతో మూవీ...

టైర్ 2 హీరోలు ఇప్పటికీ సురేందర్‌ రెడ్డితో సినిమాకు ఆసక్తిని కనబర్చుతున్నారు. అయినా కూడా సురేందర్‌ రెడ్డి మాత్రం ఆ హీరోలకు కథలు కూడా చెప్పడం లేదు అనేది ఆరోపణ. కిక్‌ వంటి అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ను అందించిన సురేందర్‌ రెడ్డి అసలు కొత్త సినిమా కు ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏ హీరోకు అయినా కథను వినిపించాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిభ ఉన్న దర్శకులు ఒక్క సినిమా కోసం ఇలా ఏళ్లకు ఏళ్లు సమయం వృథా చేయవద్దని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కోసం లేదా మరో స్టార్‌ హీరో కోసం కాకుండా, ఒక చిన్న హీరోతో అయినా సురేందర్‌ రెడ్డి సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ చిన్న హీరోతో కిక్‌ వంటి హిట్‌ కొట్టి, ప్రేక్షకులకు కిక్‌ ఇస్తే తప్పకుండా మళ్లీ స్టార్‌ హీరోల నుంచి పిలుపు వచ్చే అవకాశాలు ఉంటాయని సురేందర్‌ రెడ్డి గుర్తించాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సూరి ఇప్పటికీ అయినా ఏదో ఒక కొత్త సినిమాను ప్రారంభించేనా చూడాలి.