సూరిని కూడా వాళ్ల జాబితాలో వేసేస్తున్నారా?
ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ కంబ్యాక్ అవ్వడం అన్నది అంత సులభం కాదు. ఫాంలో ఉన్నంత కాలమే హవా సాగుతుంది.
By: Srikanth Kontham | 3 Dec 2025 7:00 PM ISTఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ కంబ్యాక్ అవ్వడం అన్నది అంత సులభం కాదు. ఫాంలో ఉన్నంత కాలమే హవా సాగుతుంది. అది కోల్పోయిన తర్వాత చేసే ప్రయత్నాలు అంత ఈజీగా కలిసి రావు. అందులోనూ ప్రస్తుత తరం దర్శకులతో పోటీ పడి అవకాశాలు అందుకోవడం అంతకన్నా సులభం కాదు. రామ్ గోపాల్ వర్మ, వి.వి వినాయక్, కృష్ణవంశీ, శ్రీనువైట్ల, బొమ్మరిల్లు భాస్కర్ , శ్రీకాంత్ అడ్డాల లాంటి వారు ఫాంలో ఉన్నంత కాలం ఎలాంటి విజయాలు అందించారో తెలిసిందే. స్టార్ హీరోలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు.
దూరం ఇంకా భారంగా:
దర్శకులుగా తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడా దర్శకులంతా కంబ్యాక్ అవ్వడం కోసం ఎంతగా శ్రమిస్తున్నారో తెలిసిందే. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు వాళ్లతో పనిచేసిన హీరోలెవరు ఇప్పుడు అవకాశాలివ్వడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఔడెటెడ్ అయిపోయారు? అనే ముద్ర పడిపోయింది. కొత్తగా వారిప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తారు? అన్న టెన్షన్ చాలా మంది హీరోల్లో ఉంటుంది. దర్శకులుగా గ్యాప్ పెరిగే కొద్ది అవకాశాలు ఇంకా దూరమవుతుంటాయి. ఇవ్వాలనుకున్న వాళ్లు కూడా పునరాలోచనలో పడుతుంటారు.
పవన్ తో ప్రాజెక్ట్ కష్టమే:
తాజాగా వీరి జాబితాలోకి సురేందర్ రెడ్డి అలియాస్ సూరి కూడా చేరువలోనే ఉన్నాడా? అంటే సన్నివేశంగా అలాగే కనిపిస్తుంది. `ఏజెంట్` తర్వాత సూరి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. అఖిల్ హీరోగా తెరకెక్కించిన ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో? తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడని రెండేళ్లగా మీడియాలో కథనాల వరకే పరిమితం తప్ప అయన నుంచి ఎలాంటి ఎఫెర్ట్ కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ తో ఓ కమిట్ మెంట్ ఉందని అప్పుడప్పుడు ప్రచారం తప్ప అందులో వాస్తవం తెలియదు. పవన్ ఉన్న బిజీ షెడ్యూ ల్ కి..సూరి స్పీడ్ కి సెట్ అవ్వడం ఎట్లాగా? అన్నది సందేహమే.
కొత్త వాళ్లతో పోటీ పడాలి:
ఈ ప్రాజెక్ట్ గురించి సూరిగానీ, పవన్ గానీ ఎక్కడా స్పందించింది కూడా లేదు. కాబట్టి ఈప్రాజెక్ట్ పై చర్చ కూడా అనవసరమైందే. అయితే సూరి సినిమా - సినిమాకు మధ్య గ్యాప్ తీసుకోవడం అన్నది పరిపాటే. రెండేళ్లకు ఒక సినిమా చేస్తుంటాడు. అతడి కెరీర్ గ్యాప్ ఓ సారి పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. 2005లో `అతనొక్కడే` తో సూరి దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు. అంటే ఇప్పటికీ రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నట్లు. మరి ఎన్ని సినిమాలు చేసాడు? అంటే కేవలం పది సినిమాలు మాత్రమే. ఇప్పటికీ అదే పంథాలో ఉన్నాడు. కానీ ఇప్పుడా నెమ్మదనం ఎంత మాత్రం వర్కౌట్ అవ్వదు. కొత్త కొత్త దర్శకులెంతో మంది వస్తున్నారు. ఇన్నో వేటివ్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. వాళ్లతో పోటీ పడి సినిమాలు చేయాలి. మరి సూరిలో ఆ సత్తా ఉందా?
