Begin typing your search above and press return to search.

శ్రీ‌మ‌తి సురేఖ చిరంజీవి ఫ్యామిలీ మేనేజ‌రే కాదు.. గొప్ప ఫిలాస‌ఫ‌ర్

తాజా ఇంటర్వ్యూలో సురేఖ కొణిదెల మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   7 March 2026 10:16 PM IST
శ్రీ‌మ‌తి సురేఖ చిరంజీవి ఫ్యామిలీ మేనేజ‌రే కాదు.. గొప్ప ఫిలాస‌ఫ‌ర్
X

అల్లు శిరీష్ - నైనికల వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేవలం అతిథులుగా హాజరుకావడమే కాకుండా.. అల్లు అరవింద్ సోదరిగా శ్రీ‌మ‌తి సురేఖ కొణిదెల‌ ఈ పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొని అండగా నిలిచారు. అటు మెగా కుటుంబానికి, ఇటు అల్లు కుటుంబానికి వారధిగా ఉంటూ పెళ్లి వేడుకను విజయవంతం చేయడంలో ఆమె అందించిన సహకారం మరువలేనిది. తన మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో వేడుకలో ఏ లోటు రాకుండా పర్యవేక్షించడం అందరినీ ఆకట్టుకుంది.

తాజా ఇంటర్వ్యూలో సురేఖ కొణిదెల మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అందరూ తనను గొప్ప మేనేజర్ అని అంటుంటారని, కానీ తాను చేసే పనిని నిజాయితీగా, నిస్వార్థంగా, ఆత్మగౌరవం దెబ్బతినకుండా చేయడమే తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఒక భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా, అత్తగా నా పని నేను చేస్తున్నాను అంతే! అంటూ సురేఖ గారు వ్యక్తం చేసిన అభిప్రాయం త‌న‌లోని వినయాన్ని, సంస్కారాన్ని చాటిచెబుతోంది.

శ్రీమతి సురేఖ కొణిదెల కేవలం ఒక స్టార్ హీరో భార్యగానే కాకుండా.. వ్యక్తిగతంగా ఎంతో ఆదర్శవంతమైన మహిళామణిగా గుర్తింపు పొందారు. బంధాల పట్ల త‌న‌కు ఉన్న విలువలు నేటి తరానికి ఒక పాఠంలా నిలుస్తాయి. తన ఇంటికి వచ్చిన కోడళ్లను తన కూతుళ్లలా భావించి.. అత్తగా తన బాధ్యతను ఎంతో హుందాగా నిర్వహిస్తున్న తీరు మెగా కుటుంబంలోని ఐక్యతకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అనుభ‌వ‌జ్ఞురాలైన ఆమె మాటల్లోని స్పష్టత, కుటుంబం పట్ల ఆమెకున్న నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శం.

సురేఖ గారు గొప్ప మనసును చాటే మరో అద్భుతమైన సంఘటన గురించి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గతంలో ఒక సందర్భంలో వెల్లడించారు. ఆస్తుల కోసం సొంత మనుషులే గొడవలు పడే ఈ లోకంలో తన ఆడపడుచులకు (చిరంజీవి సోదరీమణులు) ఆస్తులను రాసి ఇచ్చిన గొప్ప మనసు సురేఖ గారిది. సాధారణంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావడం సహజం.. కానీ సురేఖ గారు చూపిన ఈ `బ్రాడ్ మైండ్` .. ధాతృత్వం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఆడపడుచుకు అత్తగారింటి ఆస్తిలో వాటా ఇచ్చి గౌరవించడం ఆమె సంస్కారానికి నిదర్శనం.

కుటుంబం అంటే కేవలం రక్త సంబంధీకులు మాత్రమే కాదు.. అందరినీ కలుపుకుని పోవడమే అని సురేఖ నిరూపిస్తున్నారు. అల్లు శిరీష్ పెళ్లిలో ఆమె చూపిన చొరవ వెనుక కూడా అదే నిస్వార్థమైన ప్రేమ కనిపిస్తుంది. ఇంతటి ఘనమైన కుటుంబ నేపథ్యం ఉండి కూడా.. ఎంతో సాధారణంగా ఉంటూ బాధ్యతలను నెరవేరుస్తున్న సురేఖ కొణిదెల నిజంగానే నేటి తరం మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తిప్రదాత.