నిజంగా రాముడే దిగొచ్చాడా అనుకున్నా!
బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం `రామాయణ్`. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక గాథపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
By: Srikanth Kontham | 13 April 2026 6:00 AM ISTబాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం `రామాయణ్`. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక గాథపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండటంతో? ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సెట్‌లో రణబీర్‌ను రాముడి గెటప్‌లో చూసిన నటి సురభి దాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సురభి దాస్ షూటింగ్ సెట్‌లో రణబీర్ కపూర్‌ను చూసిన మొదటి క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. రణబీర్ రాముడి గెటప్‌లో నడుచుకుంటూ వస్తుంటే? ఒక్క క్షణం తాను తన కళ్ళను తానే నమ్మలేకపోయానని వెల్లడించారు. `నిజంగా ఆ శ్రీరాముడే సాక్షాత్తు భూమి మీదకు దిగి వచ్చాడా? అన్నంత గొప్పగా రణబీర్ ఆహార్యం ఉందని మనసులో అనుకున్నాను. ఆయన కళ్ళలో ప్రశాంతత, గంభీరమైన రూపం చూసి తాను మంత్రముగ్ధురాలినయ్యానని పేర్కొన్నారు.
రణబీర్ కపూర్ ఈ పాత్ర కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. కేవలం బాహ్యరూపం మాత్రమే కాకుండా? శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని ఆకళింపు చేసుకోవడానికి మాంసాహారాన్ని మానేసి, మద్యానికి దూరంగా ఉంటూ కఠినమైన నియమాలు పాటిస్తున్నారు. ఈ క్రమశిక్షణే ఆయన ముఖంలో ప్రత్యేకమైన తేజస్సును తీసుకువచ్చిందని, అది సెట్‌లోని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని సురభి వ్యాఖ్యానించారు. నటుడిగా రణబీర్ తనను తాను మలుచుకున్న తీరు అద్భుతమని ఆమె కొనియాడారు.
దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రంలోని ప్రతి పాత్రను, ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా, భక్తిభావం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ , సెట్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రామాయణ్ రూపొందుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయిన కొన్ని ఫోటోలు రణబీర్ లుక్‌పై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేయగా తాజాగా సురభి దాస్ చెప్పిన విషయాలు అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచాయి. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తోన్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఒక నటుడు తన పాత్రలో ఎంతగా లీనమైతే? సెట్‌లోని తోటి నటీనటులు కూడా అంతటి ఆశ్చర్యానికి లోనవుతారో చెప్పడానికి సురభి దాస్ మాటలే నిదర్శనం. అలాగే సినిమాలో రణబీర్ కపూర్ - సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండనుందని సురభి దాస్ హింట్ ఇచ్చారు. వీరిద్దరూ ఆయా పాత్రల కోసం ప్రాణం పెట్టి నటిస్తున్నారని, సెట్‌లో వారి మధ్య జరిగే సంభాషణలు మరియు భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఒక సరికొత్త లోకానికి తీసుకెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
