నాగవంశీ 'ఫన్నీ ర్యాగింగ్'.. సుప్రియ యార్లగడ్డ ఏమన్నారంటే?
డెకాయిట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ.. ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డపై సరదాగా ర్యాగింగ్ చేసిన విషయం అప్పట్లో ఫుల్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 13 April 2026 12:18 PM ISTడెకాయిట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ.. ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డపై సరదాగా ర్యాగింగ్ చేసిన విషయం అప్పట్లో ఫుల్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా సక్సెస్ మీట్ లో సుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగవంశీ చెప్పిన మాటలు నిజమేనని ఆమె అంగీకరించడం అందరినీ ఆకట్టుకుంది.
సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడిన సుప్రియ, సినిమా నిర్మాణంలో ఎదురైన అనుభవాలను నిజాయితీగా పంచుకున్నారు. 'మొన్న నాగవంశీ గారు 'నువ్వు క్లాసులు పీకుతావ్' అన్నారు… అది నిజమే అని ఇప్పుడు అర్థమైంది. ఒక సినిమా కోసం ఎంత కష్టపడినా, ఎంత ప్రాణం పెట్టినా కూడా ఆ సినిమా చుట్టూ ఉండే పరిస్థితులు పూర్తిగా మనం కంట్రోల్ చేయలేం' అని తెలిపారు.
అలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని సమర్థంగా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్లాలని తెలిపారు. సినిమా నిర్మాణ సమయంలో తనకు వచ్చిన ఒత్తిడి కూడా ఆమె వెల్లడించారు. 'కొన్ని సార్లు చాలా కోపం వచ్చేది. ఎందుకలా జరుగుతోంది అని అనిపించి అందరిపై అరిచేసేదాన్ని. మైక్ కూడా పక్కన పెట్టేసి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి' అని తెలిపారు.
'కానీ తర్వాత ఎడిటింగ్ లో కొన్ని సీన్లు చూసినప్పుడు, ముఖ్యంగా మృణాల్ క్లోజ్ షాట్స్ లేదా శేష్ షూట్ చేసిన సన్నివేశాలు చూసినప్పుడు మళ్లీ ఎనర్జీ వచ్చేది. అది ఒక ఫ్యూయల్ లాంటిది' అని చెప్పారు. సినిమా అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదని, తనకు అది జీవితమని సుప్రియ స్పష్టం చేశారు. 'ఇండస్ట్రీలోనే పెరిగాం. నాకు తెలిసినది సినిమానే. నాకు పేరు, గుర్తింపు ఇచ్చింది కూడా ఇదే. నేను ఈరోజు మంచి మాటలు వింటున్నా అంటే అది సినిమా వల్లే' అని భావోద్వేగంగా అన్నారు.
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగవంశీ చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. సుప్రియ ఎప్పుడూ సినిమాలు ఆలస్యంగా తీస్తున్నారని తమకు క్లాసులు చెప్పేవారని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు ఆమె స్వయంగా డెకాయిట్ సినిమా కోసం రెండు సంవత్సరాలు కష్టపడి, మొత్తం 147 వర్కింగ్ డేస్ తీసుకున్నారని సరదాగా అన్నారు. 'ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదు' అంటూ చమత్కరించారు.
అలాగే నిర్మాతగా ఉండటం ఎంత కష్టమో సుప్రియకు తెలియజేసినందుకు హీరో అడివి శేష్ కు థ్యాంక్స్ చెప్పారు నాగవంశీ. 'ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన సుప్రియ, తొలిసారి బయట హీరోతో సినిమా తీసి కొత్త అనుభవాన్ని పొందారు. ఇది ఆమెకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది' అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఆ సరదా ర్యాగింగ్ మధ్యలో ఉన్న దగ్గుబాటి సురేష్ బాబు నవ్వుతూ ఆ ఎంజాయ్ చేసిన తీరు కూడా ఈ వేడుకలో హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు సుప్రియ.. నాగవంశీ కామెంట్స్ కరెక్ట్ అనడం విశేషం.
