Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డులో సుప్రియ యార్లగడ్డ.. టాలీవుడ్‌కి లభించిన ప్రాతినిధ్యం!

అక్కినేని కుటుంబానికి చెందిన నటి, అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుప్రియ యార్లగడ్డ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) లో కీలక బాధ్యతలను చేపట్టారు.

By:  Srikanth Kontham   |   19 Sept 2026 2:37 PM IST
సెన్సార్ బోర్డులో సుప్రియ యార్లగడ్డ.. టాలీవుడ్‌కి లభించిన ప్రాతినిధ్యం!
X

అక్కినేని కుటుంబానికి చెందిన నటి, అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుప్రియ యార్లగడ్డ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) లో కీలక బాధ్యతలను చేపట్టారు. ఈ నియామకంపై స్పందించిన సుప్రియ సీబీఎఫ్‌సీలో సభ్యురాలిగా అవకాశం రావడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త ప్రయాణం తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. `ఒక సినిమా మేకర్‌గా, ప్రొడ్యూసర్‌గా సినిమాల్లోని కళాత్మక విలువలను కాపాడుతూనే సెన్సార్ బోర్డ్ నియమ నిబంధనలను సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.

పరిశ్రమలోని సవాళ్లు, సృష్టికర్తల భావోద్వేగాలు తనకు బాగా తెలుసని, అందువల్ల కళాత్మక స్వేచ్ఛకు , బోర్డు మార్గదర్శకాలకు మధ్య సరైన సమతుల్యతను పాటించడం తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

ఏఎన్నార్ మనవరాలిగా చిన్ననాటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగిన సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణం, నటన లాంటి అనేక విభాగాల్లో ఆమెకు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ అనుభవం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, సినిమా రంగానికి , బోర్డుకు మధ్య మంచి అనుసంధానకర్తగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా కథలు, చిత్రీకరణ శైలిలో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో సెన్సార్ బోర్డు పాత్ర ఎంతో కీలకమైనదని సుప్రియ అభిప్రాయపడ్డారు. సమాజానికి సరైన సందేశాన్ని అందించడంతో పాటు, దర్శక, ర‌చయితల ఆలోచనలకు భంగం కలగకుండా చూడటం ప్ర‌ధాన అంశమని తెలిపారు. బోర్డు నిబంధనలకు కట్టుబడి ఉంటూనే మంచి సినిమాలకు మద్దతుగా నిలుస్తాన‌న్నారు.

సుప్రియ యార్లగడ్డ సీబీఎఫ్‌సీ సభ్యురాలిగా నియమితులవ్వడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ సాధకబాధకాలు తెలిసిన వ్యక్తి సెన్సార్ బోర్డులో ఉండటం వల్ల సినీ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సుదీర్ఘ అనుభవం ఉన్న సుప్రియ యార్లగడ్డ కొత్త బాధ్యతల్లోనూ విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. సీబీఎఫ్‌సీలో సుప్రియ ప్రయాణం పరిశ్రమకు, సమాజానికి మధ్య మంచి వారధిలా పనిచేస్తుందని, కళా విలువలను కాపాడుతూ చిత్ర పరిశ్రమ ముందుకు సాగడానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.