సుప్రీంలో దళపతి విజయం.. కరూర్ బాధితులకు ఉద్యోగాలపై కీలక తీర్పు
తమిళనాడులో ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By: Tupaki Political Desk | 14 Aug 2026 4:00 PM ISTతమిళనాడులో ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ విషయంలో గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పరిణామం తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
గతేడాది సెప్టెంబర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా టీవీకే అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కరూర్‌లో పర్యటించారు. ఆ సమయంలో విజయ్ ని చూసేందుకు భారీగా జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది పిల్లలతో సహా మొత్తం 41 మంది దుర్మరణం చెందారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే తన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఆధారం చూపాలని భావించిన ముఖ్యమంత్రి విజయ్ ప్రమాదం జరిగినప్పుడే వ్యక్తిగతంగా నష్టపరిహారం చెల్లించారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. సుమారు 38 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ కరూర్ లోనే నియామక పత్రాలు అందజేశారు.
అయితే మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మృతుల కుటుంబ సభ్యులకు కారుణ్య ప్రాతిపదికన ఎలా ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నిస్తూ, ఈ నియామకాలు చెల్లవని తీర్పునిచ్చింది. ఏప్రిల్ లో ముఖ్యమంత్రి విజయ్ బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామకపత్రాలు అందజేయగా, జులై 27న మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 14, 16 ఆర్టికల్స్‌కు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చారని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇప్పటికే క్యూలో ఉన్న నిరుద్యోగుల హక్కులను ఇది దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ తరహా నియామకాలు భవిష్యత్తులో మరిన్ని డిమాండ్లకు దారితీస్తాయని భావిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది.
సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఊరట
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మానవతా దృక్పథంతో ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిందని చెబుతున్నారు. "ఇదొక పెద్ద విషాదం. తొక్కిసలాటలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం నష్టపరిహారంతోపాటు ఉపాధి కల్పిస్తే తప్పేముంది? ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడానికి మీరెవరు?" అని నిలదీసింది. కుటుంబంలో సంపాదనరుడు మరణించినప్పుడు, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవడంలో తప్పేంటని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో విజయ్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది.
