అంపశయ్యపై 500 కోట్లు! `జననాయగన్` రిలీజ్ డైలమా మళ్లీ మొదటికే!
ఈ వివాదంపై జనవరి 20న విచారణ జరిపి, వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది.
By: Sivaji Kontham | 15 Jan 2026 10:05 PM ISTదళపతి విజయ్ నటించిన `జననాయగన్` రిలీజ్ డైలమా నిర్మాతలు సహా పంపిణీ వర్గాలను కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం కోర్టు గొడవలో చిక్కుకుని ఉంది. అయితే సినిమా విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తున్నందున, ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఈ వివాదంపై జనవరి 20న విచారణ జరిపి, వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్.సి) నుంచి వెంటనే అనుమతి వచ్చేలా ఆదేశించాలని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.
తొలుత మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించారు. అయితే సెన్సార్ బోర్డు అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ ఆ తీర్పుపై స్టే విధించింది. దీంతో సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిన సినిమా నిలిచిపోయింది.
రాజకీయాలే కారణమా?
విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కుట్ర జరిగిందా? అంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాలి. జననాయగన్ లో కొన్ని రాజకీయపరమైన డైలాగులు, సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొదటగా `రివైజింగ్ కమిటీ`కి పంపింది. ప్రస్తుతానికి సినిమా విడుదలపై ఉన్న సస్పెన్స్ కొనసాగుతోంది. జనవరి 20న మద్రాస్ హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే `జననాయగన్` రిలీజ్ ఆధారపడి ఉంటుంది.
సినిమా కథాంశంలోని కొన్ని అంశాలు వివాదానికి అసలు కారణమని చెబుతున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని (TVK పార్టీ) ప్రారంభించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఇందులో సమాజం, రాజకీయ వ్యవస్థపై ఉన్న డైలాగులు చర్చనీయాంశమయ్యాయి. `ప్రజాస్వామ్యానికి దిశానిర్దేశం చేసేవాడు` అనే ట్యాగ్‌లైన్ కూడా సెన్సార్ బోర్డు దృష్టిని ఆకర్షించింది. ఒక వర్గం నుండి అందిన ఫిర్యాదు మేరకు, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉన్నాయని సెన్సార్ బోర్డు భావించింది.
దేశ రక్షణ దళాలకు సంబంధించిన చిహ్నాలను నిబంధనలకు విరుద్ధంగా వాడారని బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.నిర్మాతలు డిసెంబర్ 18న సెన్సార్ కోసం దరఖాస్తు చేయగా, బోర్డు సూచించిన 27 కట్‌లను నిర్మాతలు పూర్తి చేశారు. జనవరి 5న ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. మద్రాస్ హైకోర్టు (సింగిల్ జడ్జి) బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతూ వెంటనే యుఏ సర్టిఫికేట్ ఇవ్వాలని జనవరి 9న తీర్పునిచ్చారు.
ఈ తీర్పుపై సెన్సార్ బోర్డు అప్పీల్ చేయడంతో, డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది. దీనివల్ల సినిమా విడుదల నిలిచిపోయింది. ఆ తర్వాత నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా నేటి (జనవరి 15) విచారణలో ధర్మాసనం తీర్పునిస్తూ.. హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ప్రస్తుతం అందరి కళ్లూ జనవరి 20న మద్రాస్ హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఉన్నాయి. అప్పటివరకు ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఆలస్యం వల్ల నిర్మాతలకు దాదాపు రూ.500 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రిలీజ్ ఆగిపోయిన రోజే 100 కోట్లు నష్టపోయామని జననాయగన్ నిర్మాత ఆవేదన వ్యక్తం చేసారు. జననాయగన్ రిలీజ్ ఉందా లేదా తేలేది 20జనవరి తేదీన.. అప్పటివరకూ వేచి చూడాల్సిందే.
