ఒక్క హిట్‌తో కుర్రాడయిన 68 ఏళ్ల సీనియర్ హీరో!!
ప్రస్తుతం సన్నీ డియోల్ చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సన్నీ డియోల్ వయసు 68 ఏళ్లు.
By: Ramesh Palla | 23 Oct 2025 12:00 AM ISTఏ భాష సినిమా ఇండస్ట్రీలో అయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తండ్రి పాత్రల్లో నటించడం మనం చూస్తూ ఉన్నాం. కొందరు హీరోలు విలన్ రోల్స్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ అతి కొద్ది మంది హీరోలు మాత్రం ఏడు పదుల వయసు వచ్చినా హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. వారు హీరోలుగా చేస్తున్న సినిమాలకు మంచి ఆధరణ లభిస్తుంది, వసూళ్లు భారీగా వస్తున్నాయి. కనుక స్టార్ దర్శకులు, యంగ్ దర్శకులు కూడా వారితో సినిమాలు చేయాలని క్యూ కడుతూ ఉంటారు. అలాంటి సీనియర్ హీరోల్లో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ఒకరు. ఈయన కెరీర్ ఖతం అయింది, సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాల్సిందే అనుకున్న సమయంలో వచ్చిన గదర్ 2 సినిమా ఆయన మొత్తం కెరీర్‌ను టర్న్ చేసింది అనడంలో సందేహం లేదు.
68 ఏళ్ల వయసులో సన్నీ డియోల్ వరుస సినిమాలు
ప్రస్తుతం సన్నీ డియోల్ చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సన్నీ డియోల్ వయసు 68 ఏళ్లు. ఈ వయసులో ఉన్న హీరోలు ఎవరూ ఈ స్థాయిలో సినిమాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈయన సమకాలీకులు ఒకరు ఇద్దరు మాత్రమే హీరోలుగా ఇంకా సినిమాలు చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి పోయారు. అయినా కూడా సన్నీ డియోల్ మాత్రం జోరు మీద ఉన్నాడు. ఆయన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సన్నీ డియోల్ ఎక్కువగా దేశ భక్తి ప్రధానంగా సాగే సినిమాలను చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తాను చేస్తున్న సినిమాల్లో ఎక్కువ ఆ తరహా సినిమాలు చేస్తూ ఉన్నాడు.
బార్డర్ సినిమాకు సీక్వెల్ రెడీ..
1997లో వచ్చిన బార్డర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా కు సీక్వెల్ అన్నట్లుగా ఇప్పుడు బార్డర్ 2 సినిమాను చేస్తున్నాడు. ఎప్పటిలాగే దేశ భక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాపై సన్నీ డియోల్ అభిమానుల్లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. గదర్ 2 సినిమాను మించి బార్డర్ 2 సినిమా ఉంటుంది అంటూ సన్నీ డియోల్ సన్నిహితులు ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దాంతో బార్డర్ 2 పై అంచనాలు పెరిగాయి. అది మాత్రమే కాకుండా సన్నీ డియోల్ లాహోర్ 1947, గబ్రు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా ప్రధానంగా సన్నీ డియోల్ రామాయణ సినిమాల్లో కనిపించబోతున్నాడు. రెండు పార్ట్‌ల్లోనూ హనుమాన్ పాత్రలో ఈయన అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
గదర్ 2 కారణంగా వరుస సినిమాలు
2023లో వచ్చిన గదర్ 2 సినిమాతో సన్నీ డియోల్ జోష్ ఒక్కసారిగా పెరిగింది. ఆ ఒక్క సినిమా ఇచ్చిన హిట్‌తో సన్నీ డియోల్ ఏకంగా యంగ్ హీరోలకు పోటీ అన్నట్లుగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఎంపిక చేసుకుంటున్న కథలు, దర్శకులను చూస్తే యంగ్ హీరోగా ఉన్నప్పుడు ఎలాంటి జోష్‌ను కనబర్చాడో అలాంటి జోష్‌ను ఇప్పుడు సన్నీ డియోల్ కనబర్చుతున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఆయన జోరు మరో అయిదు నుంచి పదేళ్ల పాటు కొనసాగుతుందని అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. సన్నీ డియోల్ దేశ భక్తి సినిమాలతో రాబోయే రెండు మూడు ఏళ్ల పాటు ప్రేక్షకుల్లో జై భారత్ నినాధాలను మారుమ్రోగేలా చేస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 68 ఏళ్ల వయసులో ఇంత స్పీడ్‌గా సినిమాలు చేయడం సన్నీ డియోల్‌కే చెల్లిందని నెటిజన్స్ సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
