Begin typing your search above and press return to search.

ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోని బ‌య‌ట‌ప‌డేసే రియ‌ల్‌ హీరో ఇతడేనా?

``అత‌డు ముస‌లోడు.. ప‌నైపోయింద‌ని అనుకున్నారు``.. కానీ అతడు లేట్ ఏజ్‌లోను భ‌ళ్లూక ప‌ట్టు ప‌డుతున్నాడు! బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో మ‌తులు పోయే ట్రీటిస్తున్నాడు.

By:  Sivaji Kontham   |   12 Feb 2026 7:00 AM IST
ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోని బ‌య‌ట‌ప‌డేసే రియ‌ల్‌ హీరో ఇతడేనా?
X

``అత‌డు ముస‌లోడు.. ప‌నైపోయింద‌ని అనుకున్నారు``.. కానీ అతడు లేట్ ఏజ్‌లోను భ‌ళ్లూక ప‌ట్టు ప‌డుతున్నాడు! బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో మ‌తులు పోయే ట్రీటిస్తున్నాడు. ఇంత‌కీ ఈ లేటు వ‌య‌సు ఘాటు హీరో ఎవ‌రో ప‌రిచ‌యం చేయాలా?

బాలీవుడ్ వెట‌ర‌న్.. ది గ్రేట్ స‌న్నీడియోల్ గురించే ఇదంతా. వ‌రుస‌ సీక్వెల్స్‌తో దుమ్ము లేపుతున్న సీనియ‌ర్ హీరో స‌న్నీడియోల్ ఇటీవ‌లే `బార్డ‌ర్ 2`తోను బంప‌ర్ హిట్టు కొట్టాడు. ఇంత‌కుముందు గ‌ద్ద‌ర్ 2 అత‌డి కెరీర్ కంబ్యాక్ అవ్వ‌డానికి బిగ్ బూస్ట్ ఇచ్చింది. పూర్తిగా డియోల్ శ‌కం ముగిసింది! అనుకుంటున్న త‌రుణంలో కొన్నేళ్ల పాటు బ‌య‌టి ప్ర‌పంచానికి క‌నిపించ‌ని స‌న్నీడియోల్.. ఉన్న‌ట్టుండి గ‌ద్ద‌ర్ 2 తో స‌క్సెస్ స్ట్రీక్ లోకి దూసుకొచ్చాడు. గ‌ద్ద‌ర్ 2 చిత్రం 500కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఇప్పుడు మ‌రో సీక్వెల్ చిత్రం బోర్డ‌ర్ 2 కూడా ఏకంగా 400కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం.

ఇలాంటి త‌రుణంలో ఇప్పుడు అత‌డు న‌టించిన లాహోర్ సీక్వెల్ `లాహోర్ 1947` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. లేటు వ‌య‌సులో దుమ్ము లేపుతున్న స్టార్ హీరో ఈసారి త‌న స్నేహితుడు అమీర్ ఖాన్ తో క‌లిసి ప‌ని చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టి `లాహోర్ 1947`పైనే ఉంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అత‌డిని మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన మాస్ హీరో సన్నీ డియోల్ గట్టెక్కిస్తాడా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమీర్ ఖాన్‌కు ఇది చాలా కీలకమైన సినిమా. `లాల్ సింగ్ చడ్డా` ప్లాప్ తర్వాత అమీర్ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లాహోర్ సీక్వెల్ కి రాజ్ కుమార్ సంతోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో దీనిపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఇక‌ సన్నీ డియోల్ - రాజ్‌కుమార్ సంతోషి కాంబినేషన్ (ఘాయల్, ఘాతక్, దామిని) అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. దానికి అమీర్ ఖాన్ నిర్మాణ విలువలు తోడవ్వడం సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

గద్దర్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సన్నీ డియోల్ `బోర్డర్ 2`తోను మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు. ఇప్పుడు `లాహోర్ 1947` కూడా హిట్ అయితే పీరియడ్ డ్రామాతో అత‌డు హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ సినిమా ఆగ‌స్టు 13న స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా విడుద‌ల కానుంది. దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమాలకు ఆగస్ట్ 15 మంచి సీజన్. `గద్దర్ 2` కూడా ఇదే సమయంలో వచ్చి రికార్డులు సృష్టించింది. అందువ‌ల్ల ఇప్పుడు లాహోర్ సీక్వెల్ కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తున్నారు. ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత ప్రీతి జింటా రీఎంట్రీ ఇస్తుండ‌టం ప్రేక్షకుల్లో మరో ఆకర్షణగా మారింది. విభజన కాలం నాటి ఎమోషనల్ పీరియడ్ డ్రామాలో ప్రీతి పాత్ర ఏమిట‌న్న‌ది వేచి చూడాలి.

అమీర్ ఖాన్ జాతకం మారుతుందా?

వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో దూకుడు మీద ఉన్న స‌న్నీడియోల్.. ఫ్లాపుల్లో ఉన్న త‌న‌ స్నేహితుడు అమీర్ ఖాన్ జాత‌కం మార్చేస్తాడ‌ని అంతా భావిస్తున్నారు. అమీర్ ఖాన్ లాహోర్ 1947 చిత్రానికి కేవలం నిర్మాతగానే కాకుండా, ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారని టాక్ ఉంది. కంటెంట్ మీద విపరీతమైన పట్టున్న రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వ‌హించ‌డం ప్ల‌స్ కాగా, సన్నీ డియోల్ మాస్ ఇమేజ్‌ను సరిగ్గా వాడుకుంటే ఇది అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌కు పూర్వ వైభవం తీసుకురావడం ఖాయమ‌ని అంచ‌నా వేస్తున్నారు. 60 ప్ల‌స్ వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ డియోల్ సాబ్ నిజంగా ఆద‌ర్శంగా మారారు.